ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
పలు గ్రామాల్లో రైతుబంధు సంబురాలు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెకుల పంపిణీ
పాల్గొన్న జడ్పీ అధ్యక్షురాలు వసంత
జగిత్యాల రూరల్, జనవరి 9 : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర సర్కారు రైతు పక్షపాతి అని జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని చల్గల్, లక్ష్మీపూర్, పొలాస, కల్లెడ, పొరండ్ల గ్రామాల క్లస్టర్ పరిధిలో రైతుబంధు ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత వంద మందికి రూ. 1,00,11,600 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి ఒకరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారన్నారు. రూ.50 వేల కోట్లను రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత దేశంలో రాష్ట్ర ప్రభుత్వానికే దకుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతి రైతు గమనించాలని, రైతుల కోసమే సీఎం పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో రైతు ధర్నాలు చేపట్టామన్నారు. దాంతో కేంద్రం రైతు చట్టాలను వెనకు తీసుకుందని గుర్తు చేశారు. పంట మార్పిడి ద్వారా రైతులకు లాభాలు వస్తాయని, రైతు బంధు సంబురా ల్లో భాగంగా అనేక మంది అభ్యుదయ రైతులు ముందుకు వస్తున్నారన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించి లాభార్జన దిశగా సాగు చేయాలని రైతులను కోరారు. అనంతరం జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారన్నారు. అనంతరం పొరండ్ల గ్రామంలో ముదిరాజ్ సంఘ భవనానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్, అర్బన్ ఎంపీపీ ములాసపు లక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల ముకుందం, రైతుబంధు మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ సందీప్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చెరుకు జాన్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మహేశ్, యూత్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, హెచ్‌సీఏ మెంబర్ దావ సురేశ్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.