ఫ్రంట్‌లైన్, హెల్త్ కేర్ వర్కర్లకు ప్రాధాన్యం
60 ఏండ్లుదాటిన దీర్ఘకాలిక రోగులకు కూడా టీకా
సెకండ్ డోసు వేసుకొని తొమ్మిది నెలలు దాటినా వారూ అర్హులే
సిద్ధంగా వైద్య యంత్రాంగం
కరీంనగర్, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న వేళ రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది.ఓ వైపు వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే.. మరో వైపు నిర్ధారణ పరీక్షలను పెంచుతున్నది. ఇంకోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. నేటి నుంచి బూస్టర్ డోస్ (ప్రికాషనరీ డోస్) ఇవ్వనుండగా, జిల్లా యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగింది. అన్ని పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ దవాఖానలు, ప్రభుత్వ ప్రధాన దవాఖానల్లో ఏర్పాట్లు చేసింది. మొదటి డోస్ వేసుకున్నప్పుడే కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ అయి ఉంటుందని, ఇప్పుడు మరోసారి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నది.
కరోనాను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. తాజాగా ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మొదటి డోసు టీకాలు వంద శాతానికి మించాయి. రెండో డోసు టీకాలు కూడా పూర్తి కావస్తున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏండ్లలోపు ఉన్న టీనేజర్లకు కూడా వ్యాక్సిన్లు వేస్తున్నారు. గతేడాది జనవరిలో మొదలైన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఏడాది పూర్తి చేసుకోగా, సోమవారం నుంచి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ప్రస్తుతం ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ కేర్ వర్కర్లు, 60 ఏండ్లు దాటిన వారికి బూస్టర్ డోసులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ దవాఖానలు, ప్రభుత్వ ప్రధాన దవాఖానల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా కలెక్టర్లు బూస్టర్ డోస్ టీకాలపై ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో అయితే ముందుగా ఆశ వర్కర్లు, అంగన్వాడీలకు పూర్తిస్థాయిలో బూస్టర్ డోసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ జిల్లాలో అన్ని పీహెచ్‌సీల్లో టీకా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 60 ఏండ్లు దాటిన వాళ్లు, రెండో డోసు తీసుకుని తొమ్మిది నెలలు దాటిన వాళ్ల కోసం కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో, వైశ్యభవన్‌లో కూడా ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. బూస్టర్ డోసుకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ జువేరియా కోరారు.
వీరికే డోస్..
ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉన్న ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, పోలీసులతోపాటు హెల్త్ కేర్ వర్కర్లుగా ఉన్న ఏఎన్ఎంలు, నర్సులకు ఈ బూస్టర్ ఈ డోస్ ఇవ్వనున్నారు. హెల్త్ కేర్ వర్కర్లలో కేవలం ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారే కాకుండా ప్రైవేట్ దవాఖానల్లో పనిచేస్తున్న వారికి కూడా ఈ టీకాలు ఇస్తారు. వీరితోపాటు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న 60 ఏండ్లు దాటిన వారికి కూడా బూస్టర్ ఇవ్వనున్నారు. రెండో డోస్ టీకాలు వేసుకుని తొమ్మిది నెలలు దాటిన వారు కూడా అర్హులని, మార్చి- ఏప్రిల్ నెలల్లో రెండో డోస్ వేసుకున్న వాళ్లు కూడా అర్హులని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మొదటి డోస్ టీకాలు వేసుకున్నప్పుడే కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.