వీణవంక రూరల్, అక్టోబర్ 8: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులకు ఉచిత కరెంట్ ఎందుకిస్తలేరని, రైతు వ్యతిరేక పార్టీకి తెలంగాణలో ఓట్లడిగే హక్కు లేదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని ఘన్ముకుల గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారని తెలిపారు. సాగునీరు, 24గంటల కరెంట్ ఇస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ శుద్ధజలం ఇస్తున్నట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో రైతులను కారుతో తొక్కించి చంపిన పార్టీ బీజేపీ అని తెలిపారు. మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రైతుబంధు, రైతుబీమా ఇస్తూ ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. మేనమామలా ఆడబిడ్డల వివాహాలకు రూ.లక్షా 116 కట్నంగా ఇస్తున్నారని తెలిపారు. బీజేపీకి పదవులు, అధికారం మీద ఉన్న ప్రేమ ప్రజాసంక్షేమంపై లేదని విమర్శించారు. వ్యవసాయ బావులు, బోర్లకు మీటర్లు పెట్టి ఉచిత కరెంట్‌ను అడ్డుకోజూస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సాగునీటికి ఢోకా లేదని చెప్పారు. రైతన్నలు పండించిన వరి ధాన్నాన్ని కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఇక్కడి బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బతుకమ్మ పండుగకు మన ఆడపడుచులకు కేసీఆర్ కానుకగా చీరెలు ఇస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం గ్యాస్ ధర పెంచిందన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను అడ్డగోలుగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనగా వందకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. విద్యార్థి ఉద్యమ నేతను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నసీరొద్దీన్, సింగిల్‌విండో డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి, గోవిందరెడ్డి, నాగమల్ల కోటేశ్వర్, ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు పాల్గొన్నారు.