ధరల భారం మోపే ఆ పార్టీకి ఓటెందుకు వేయాలి
మంత్రి కొప్పుల ఈశ్వర్
23 వ వార్డులో విస్తృత పర్యటన
జమ్మికుంట, అక్టోబర్6: ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తూ.. తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కేంద్రంలోని బీజేపీని తరిమికొట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలపై ధరల భారం మోపుతూ.. నల్ల చట్టాలతో రైతుల నడ్డి విరిచే ఆ పార్టీకి ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. బుధవారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో ఇంటింటికీ వెళ్లారు. విస్తృతంగా పర్యటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని ఓటును అభ్యర్థించారు. తర్వాత వార్డు ప్రజలతో గుమస్తాల సంఘం భవనంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని, పనిచేసే ప్రభుత్వానికే అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నిన్న, మొన్నటి దాకా మంత్రిగా పనిచేసిన ఈటల, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడాన్ని తప్పుబట్టారు. ప్రచారాలను తిప్పికొట్టాలని యువతను కోరారు. అభివృద్ధిని పట్టించుకోని ఈటలకు ఇక్కడ స్థానం లేదన్నారు. అనంతరం యువతతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన విధానాలను సూచించారు. వార్డు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య యువకులతో వాడల్లో తిరుగుతూ.. జై తెలంగాణ నినాదాలు చేశారు. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, రాజ్‌కుమార్, మల్లయ్య తదితరులు ఉన్నారు.
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు మరింత ‘సహకారం’
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా మరింత సహకారం అందిస్తామని, వస్తున్న పింఛన్‌ను పెంచేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బుధవారం హుజూరాబాద్ మండలం శాలపల్లిలోని దినేశ్ ఫంక్షన్ హాల్లో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా విరమణ ఉద్యోగులు తమకు వస్తున్న పింఛన్, తదితర సమస్యలను అమాత్యుడి దృష్టికి తీసుకెళ్లారు. విరమణ ఉద్యోగులు, కార్మికులకు కేవలం రూ.2వేల వరకే పింఛన్ వస్తున్నదని, అది వారికి సరిపోవడం లేదని సీఎం కేసీఆర్‌కు వివరించగా, మరో రూ.2వేలు పెంచేందుకు ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు కొప్పుల చెప్పారు. త్వరలో రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు అందిస్తానని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికలో సింగరేణి ఉద్యోగులు తమ వంతు బాధ్యతగా ప్రచారం చేయాలని, పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రిటైర్డ్ ఉద్యోగ సంఘం నాయకులు, సభ్యులు ఉన్నారు.