జమ్మికుంట మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి విస్త్రృత ప్రచారం
అడుగడుగునా బ్రహ్మరథం
మంగళహారతులతో ఘనస్వాగతం
కోలాటాలు, బతుకమ్మ ఆటలు, డప్పుచప్పుళ్లతో ఎదుర్కోలు
గెలుపు కోసం తరలివచ్చిన యువతరం
వినోద్, అరూరి రమేశ్‌తో కలిసి రోడ్‌షో
జమ్మికుంట/జమ్మికుంట రూరల్, అక్టోబర్ 4 : టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ వెంటే పల్లెలు కదులుతున్నాయి. ప్రచారానికి పల్లె జనం ప్రభంజనమై తరలివస్తున్నారు. సోమవారం జమ్మికుంట మండలంలోని శాయంపేట, నాగంపేట, గండ్రపల్లి, తనుగుల, బిజిగిరిషరీఫ్, వెంకటేశ్వర్లపల్లి, సైదాబాద్ గ్రామాల్లో పర్యటించిన శ్రీనివాస్‌యాదవ్‌కు డప్పుచప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మలు, మంగళహారతులతో పల్లె ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ఆయాచోట్ల రోడ్‌షోలో పాల్గొనగా, ‘యువకులు అన్నా’ మీ గెలుపు కోసం మేమున్నామంటూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా మహిళలు బొట్టు పెట్టి గెలువాలని నిండు మనసుతో ఆశీర్వదించారు.
టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు సీను గెలుపు కోసం పల్లెలు ఏకమవుతున్నాయి. సోమవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి జమ్మికుంట మండలంలోని శాయంపేట, నాగంపేట, గండ్రపల్లి, తనుగుల, బిజిగిరిషరీఫ్, వెంకటేశ్వర్లపల్లి, సైదాబాద్‌లో ప్రచారం నిర్వహించగా, ఆయా గ్రామాల ప్రజలు ప్రభంజనంలా తరలివచ్చారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లు, మహిళల కోలాటాలు, బతుకమ్మ ఆట, పాటలతో గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. అభ్యర్థి వెంట తిరిగారు. ఇంటింటా బొట్టు పెడుతూ ఓటును అభ్యర్థించగా, టీఆర్ఎస్కే వేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ నినాదాలు చేస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని స్పష్టం చేశారు. గెల్లు సీనును గెలిపించుకుంటామని ప్రతినబూనారు. తర్వాత వినోద్‌కుమార్, అరూరి రమేశ్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ బిజిగిరిషరీఫ్లోని దర్గాను సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు సుజాత, రవీందర్రావు, లింగారావు, దేవేందర్‌రావు, సమ్మయ్య, మధూకర్, కుమార్, కరుణాకర్, ఉదయశ్రీ, స్వరూప, సునీత, రమేశ్, స్వాతి, కృష్ణారెడ్డి, అశోక్, రమేశ్, సంజీవరెడ్డి, కుమార్, రమేశ్, మహేందర్, హరీశ్, లింగమూర్తి, చిరంజీవి, మూర్తి, మల్లయ్య, బాపు, సదయ్య, రాజయ్య, యుగేందర్‌రెడ్డి, వాసుదేవారెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డి, సమ్మిరెడ్డి, సాంబ, రాజయ్య, హరిబాబు, దామోదర్, జితేందర్‌రెడ్డి, ప్రమోద్, వెంకటేశ్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
‘ఏడేండ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ, రెండున్నరేండ్లుగా ఎంపీ పదవిలో ఉన్న బండి సంజయ్ ఒక్క పైసా అభివృద్ధి చేయలేదు. నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి పేదోళ్లపై పెనుభారం మోపుతున్నది. అలాంటి పార్టీకి ఓటుతోనే బుద్ది చెప్పాలి’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. సంక్షేమం.. అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్తున్న టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి జమ్మికుంట మండలంలో సోమవారం జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. పార్టీలో అవకాశం ఇచ్చి మంత్రిగా చేసిన సీఎంపై ఈటల చేస్తున్న విమర్శలను తప్పుబట్టారు. గోరీ కడుతనని అనడం సబబుకాదన్నారు. దిగజారి మాట్లాడద్దని హితవు పలికారు. ఉద్యమకారుడు, పేదింటి బిడ్డ గెల్లు సీనుకే ఓటేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇక్కడి ప్రజలపై రుద్దబడిందని, ఓటు ద్వారా ఈటలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఏడేండ్లుగా కేంద్రంలో నిన్నామొన్నటిదాకా బీజేపీ వ్యతిరేక విధానాలను తప్పుబట్టిన ఈటల, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్ల అడుగుతున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన బీజేపీ, రాష్ర్టానికి ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో కొత్త తరానికి ప్రాతినిథ్యం అందించాలని సీఎం కేసీఆర్, పేదింటి బిడ్డ గెల్లుకు టికెట్టిచ్చాడని చెప్పారు. ఉద్యమకారుడు, పేదింటి బిడ్డ గెల్లు సీనును ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. జడ్పీటీసీ శ్యాం, ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
.