తెలంగాణకే వాటర్ జంక్షన్‌గా శ్రీ రాజరాజేశ్వర జలాశం
నేతన్నలు, కార్మికుల కోసం సీఎం చేసింది ఎంత చెప్పుకున్నా తక్కువే
ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్
రాజన్నసిరిసిల్ల, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఈ ప్రాంత ప్రజలు కోరంగనే సిరిసిల్లను జిల్లాను ఏర్పాటు చేయడమే కాదు ఇన్ని హంగులతో ఇంత అద్భుతాలు జరుగుతున్నాయంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతనే అని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో అవగాహన ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ చిన్ననాటి నుంచి ఇక్కడే తిరిగారని, ఉద్యమ సమయంలోనూ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని రాజరాజేశ్వరుడి మీద ఉన్న భక్తి ప్రవత్తులతోనే జిల్లాకు రాజన్న సిరిసిల్ల అని, మిడ్‌మానేరుకు రాజరాజేశ్వర రిజర్వాయర్ అని పేరు పెట్టారని చెప్పారు. ఒకప్పటి మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల ఎస్సారార్ ప్రాజెక్టు నిర్మాణంతో వాటర్ జంక్షన్‌గా మారిందని, ఎర్రటి ఎండల్లో ఎగువ మానేరు మత్తళ్లు దుంకిన అద్భుత ఘట్టాన్ని చూశామని, ఇది ఆయన కార్యదక్షత వల్లే సాధ్యమైందని చెప్పారు. అన్నపూర్ణ రిజర్వాయర్ కూడా మన కండ్ల ముందే పూర్తయిందని చెప్పారు. రిజర్వాయర్లు కట్టడమే కాదు.. మిడ్‌మానేరు, అప్పర్‌మానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్, కొత్తగా నిర్మిస్తున్న మల్కపేట రిజర్వాయర్, ఇంకా మిషన్‌కాకతీయ పథకం కూడా దిగ్విజయంగా పూర్తి చేయడంతో ఇవ్వాళ జిల్లాలో భూగర్భజలాలు ఆరుమీటర్ల మీదికి పెరిగాయని చెప్పారు. ఆరుమీటర్లు అంటే దేశంలో ఎక్కడా జరుగలేదని, కాబట్టే.. సిరిసిల్ల జలసంరక్షణ చర్యలపై ముస్సోరిలోని ఐఏఎస్‌ల శిక్షణ కేంద్రంలో యువ ఐఏఎస్‌లకు ఒక పాఠ్యాంశంగా చెబుతున్నారనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు.
జిల్లా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసిన జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం దాదాపు రెండు వారాల నుంచి ప్రభుత్వ శాఖల అధికారులు అవిశ్రాంతంగా పని చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం మేరకు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేస్తూ ప్రజలకు పారదర్శకమైన పరిపాలన, ప్రభుత్వ పథకాల ఫలాలను అందించేందుకు నిబద్ధతతో కలిసి పని చేయాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే, జిల్లాలో డబుల్బెడ్రూంలు, ఐడీటీఆర్, రైతు వ్యవసాయ మార్కెట్ యార్డు, సమీకృత కలెక్టరేట్ నిర్మాణం పూర్తిచేసేందుకు సహకరించిన జిల్లా యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.