క్షతగాత్రులపై మానవత్వం చూపిన సీఎం కేసీఆర్
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేల చొప్పున సాయం
కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు
హుజూరాబాద్ టౌన్, జనవరి 2: గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. వారికి మెరుగైన వైద్యం అందించడమే కాకుండా కోలుకున్నాక ఎస్పీ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేల చొప్పున సాయం అందించింది. హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాజపల్లి సమీపంలో గత అక్టోబర్ 26న శాలపల్లి-ఇందిరానగర్‌కు చెందిన మహిళలు దళిత బంధు అవగాహన కార్యక్రమానికి ఆటోలో వెళ్తుండగా వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందగా, మిగతా 19 మందికి గాయాలయ్యాయి. ఇందులో శనిగరపు లత తీవ్రంగా గాయపడిన నాటి నుంచి మంచానికే పరిమితమైంది. మిగతా 18 మంది హన్మకొండలోని కార్పొరేట్ స్థాయి (మ్యాక్స్ క్యూర్) దవాఖానలో మెరుగైన చికిత్స పొంది పూర్తిస్థాయిలో అందరూ కోలుకున్నారు. వీరిలో ఎనిమిది మందికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒకొకరికీ రూ.50 వేల చొప్పున ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ ఆదివారం చెక్కులు అందజేశారు. మరో పది మందికి కూడా త్వరలోనే చెకులు ఇప్పించేందుకు కృషి చేస్తామని, టెక్నికల్ సమస్యలు రావడంతో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పెద్దన్నలా ఆదుకుంటున్నడు
రోడ్డు ప్రమాదంలో మా అమ్మ లత నడుము విరిగి మంచానికే పరిమితం కావడంతో మా కుటుంబం గడవడం దినదిన గండంగా మారింది. మాకు ఇప్పటికే ఆర్థిక సాయం అందించడంతో పాటు మా కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించేందుకు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ కృషి చేశారు. ఇప్పుడు రూ.50 వేల ఆర్థిక సాయం ఇచ్చిన్రు. మా ఇంటి పెద్దన్నలాగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటం.
-శనిగరపు రాజేశ్ (బాధితురాలు లత కుమారుడు)
దళితులపై కేసీఆర్‌కు అమితమైన ప్రేమ
ఆటో బోల్తాపడిన ఘటనలో గాయాలైన క్షతగాత్రులకు కార్పొరేట్ దవాఖానలో మెరుగైన వైద్య సేవలందించడంతో త్వరగా కోలుకున్నారు. బాధితులందరినీ ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తాం. దళితులు అంటే సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ. పార్టీ కార్యకర్తలు అయినా, కాకపోయినా వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి తక్షణ సాయంగా ఈ చెక్కులను మంజూరు చేశారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలి.
-బండ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్