దాడి చేయించుకొని సానుభూతి పొందే ప్రయత్నం
గతంలో బండి సంజయ్, రఘునందన్ చేసిందిదే..
బీజేపీ డ్రామా ఆర్టిస్టుల కంపెనీగా మారింది
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
హుజూరాబాద్, అక్టోబర్ 1: బీజేపీ నేత ఈటల రాజేందర్ కొత్త నాటకాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కమలాపూర్ మండలానికి చెందిన ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుడు, బీజేపీ నాయకుడు బాలసాని కుమారస్వామిగౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని సిటీసెంటర్హాల్లో సుమ న్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీజేపీ డ్రామా ఆర్టిస్టుల కంపెనీ అని, వాళ్లకు నాటకాలు ఆడడం కొత్తేమి కాదని ఎద్దేవా చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడిన దానిలో తప్పేమీ లేదని, కొత్త నాటకాలాడేందుకు ఈటల పన్నాగం పన్నుతున్నారన్నారు. అనుచరులతో తానే దాడి చేయించుకొని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. గతంలో బండి సంజయ్, రఘునందన్ ఇలాగే నాటకాలాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈటల మొసలి కన్నీళ్లకు, సానుభూతి మాటలకు బోర్లాపడితే మోసపోతామన్నారు.
స్వప్రయోజనాల కోసమే రాజీనామా
ఈటల రాజేందర్ తన సొంత ప్రయోజనాల కోసమే రాజీనామా చేశాడని విప్ బాల్క సుమన్ విమర్శించారు. తాను బీజేపీలో చేరితే ఒప్పు, టీఆర్ఎస్సోళ్లు సొంతింటికి వస్తే తప్పని బట్ట కాల్చి బద్నాం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. బడుగు బలహీన వర్గాల భూములు ఆక్రమిస్తే ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే, సొం త లాభం కోసం బీజేపీలో చేరి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటి వరకు రాజీనామా ఎందుకు చేసిండో చెప్పడం లేదని, ఆత్మగౌరవం అని నాటకాలాడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాజేందర్ కారణంగానే నియోజకవర్గ అభివృద్ధి కుంటు పడిందని ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కడిగిన ముత్యం అని, ఉద్యమంలో అనేకసార్లు జైలుకు పోయారని గుర్తు చేశారు. శ్రీనివాస్‌ను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా అం దజేసి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాము లు కావాలన్నారు. అభివృద్ధిని అడ్డుకునే బీజేపీ వైపు ఉంటారా? అభివృద్ధి చేసే టీఆర్ఎస్ వైపు ఉంటారా? తేల్చుకోవాలన్నారు. నాయకులు పింగిళి రమేశ్, దేశిని కోటి, చుక్క రంజిత్, లాండిగె లక్ష్మణ్, మారెపెల్లి నవీన్ ఉన్నారు.