డంప్‌యార్డు క్లీనింగ్‌కు బయోమైనింగ్
ఇప్పటికే టెండర్లు పూర్తి
త్వరలోనే పనుల ప్రారంభం
ఏడాదిలోగా పూర్తి చేసేందుకు కసరత్తు
కార్పొరేషన్, జనవరి 1: నగరంలో ఏళ్లుగా ఉన్న డంప్‌యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మానేరు తీరంలో ఉన్న డంప్‌యార్డును బయోమైనింగ్ ద్వారా పూర్తిగా క్లీన్ చేసేందుకు బల్దియా సన్నాహాలు చేస్తున్నది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ పనులు చేపట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకు రాగా, త్వరలోనే వాటిని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
నగరంలోని మానేరు నది తీరంలో ప్రస్తుతం 8 ఎకరాల విస్తీర్ణంలో డంప్‌యార్డు ఉంది. ఇందులో ఇప్పటికే ఏళ్ల తరబడిగా వేస్తున్న చెత్త పేరుకుపోయింది. వేసవిలో మంటలు వ్యాపించి పొగ, దుర్వాసన రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో స్థానిక నేతలు పలుసార్లు సమాలోచనలు చేశారు. ఇందులో భాగంగానే బయోమైనింగ్ విధానంలో దీనిని పూర్తిగా క్లీన్ చేయాలని, అలాగే మానేరు నది తీరంలో చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్‌లో భాగంగా ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ఏడాదిలోగా క్లీన్
ప్రస్తుతం సుమారు రూ.18 కోట్ల వ్యయంతో బయోమైనింగ్ చేపడుతున్నారు. ఇప్పటికే టెండర్లు కూడా నిర్వహించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి సంబంధిత కాంట్రాక్టర్లతో పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రస్తుతం డంప్‌యార్డులో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ చెత్తతో పాటు ప్రతి రోజూ వస్తున్న చెత్తను కూడా క్లీన్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మొదటి వచ్చే రెండు నెలల్లో బయోమైనింగ్‌కు సంబంధించిన ప్లాంట్లను పూర్తి స్థాయిలో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మొదటి నాలుగు నెలల్లో ప్రస్తుతం ఉన్న చెత్త నుంచి 40శాతం చెత్తను క్లీన్ చేయాల్సి ఉండగా.. మరో మూడు నెలల్లో 70 శాతం వరకు, మరో మూడు నెలల వరకు 100 శాతం డంప్‌యార్డును క్లీన్ చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన ఏడాదిలోగా ఈ డంప్‌యార్డును పూర్తిగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. అలాగే, డంప్‌యార్డుకు ప్రతి రోజూ వచ్చే చెత్తను పూర్తిస్థాయిలో ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసేలా ఈ ప్రాజెక్టులో చేపట్టనున్నారు. ప్రస్తుతం డంప్‌యార్డు ఉన్న ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో ఆధునీకరణ చేసి సుందరీకరణ చేయనున్నారు.
డంప్‌యార్డు సమస్యను పరిష్కరిస్తాం
డంప్‌యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఇందుకోసం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటున్నం. బయోమైనింగ్ విధానంలో ప్రస్తుతం ఉన్న డంప్‌యార్డును పూర్తిగా క్లీన్ చేయడంతో పాటు ప్రతి రోజూ వచ్చే చెత్తను రీసైక్లింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నం. డంప్ యార్డు ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం.