తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై సవాలక్ష సందేహాలు తలెత్తుతున్నాయి. 56 ప్రశ్నలు, 75 అంశాలతో సేకరించనున్న సమాచారంలో వ్యక్తిగత సమాచారానికి సంబంధించినవే ఎక్కువగా ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే సమయంలో అన్ని వివరాలు ఇవ్వాలా..? లేదా..? అన్న సంశయం ప్రజల్లో కనిపిస్తున్నది. సర్వేలోని అంశాలను నిశితంగా పరిశీలిస్తే.. ఈ వివరాల ఆధారంగా సంక్షేమ పథకాలకు ప్రభుత్వం వాత పెడుతున్నదన్న డౌట్లు వివిధ వర్గాల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ప్రభుత్వం కులగణనకు పరిమితం కాకుండా.. సర్వే పేరిట అనేక వివరాలు సేకరిస్తున్నదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా స్థిర చరాస్తులు, ఆదాయ పన్నుల వివరాల వంటివి అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.
కరీంనగర్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కమాన్‌పూర్ : సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) నేటి నుంచి ప్రారంభం కానున్నది. నెల రోజుల్లోనే పూరి ్తచేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అయితే ఈ ప్రక్రియలో అడిగే ప్రశ్నలు, తీసుకునే సమాచారంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 56 ప్రశ్నలు.. 75 అంశాలకు సంబంధించి సమాచారం సేకరించడానికి సర్వే ఫార్మాట్‌ను ప్రభుత్వం రూపొందించగా.. అందులో అనేక అంశాలు కుటుంబ వ్యక్తిగత వివరాలకు సంబంధించినవేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.
మచ్చుకు కొన్ని అంశాలను పరిశీలిస్తే.. సర్వే ఫార్మాట్ కాలం నంబర్ 20లో మీరు ప్రస్తుతం ఏమి పని చేస్తున్నారు? అనే ప్రశ్న అడిగారు. దీనికి అనుసంధానంగా చూస్తే.. కాలం నంబర్ 23లో వ్యాపారం, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక వేత్త, అయితే వారి వార్షిక టర్నోవర్ వివరాలు నమోదు చేయాలని సూచించారు. అలాగే కాలం నంబర్ 29లో మీరు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా..? అని అడిగారు. ఇక్కడ ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఆదాయ పన్ను చెల్లిస్తున్నామని చెబితే.. సంక్షేమ పథకాలు వర్తిస్తాయా..? లేదా అన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు, అలాగే రైతు రుణమాఫీ చేసేందుకు ఈ తరహా అనేక నిబంధనలు పెట్టింది. అంతేకాదు, ట్యాక్స్ కట్టే వారికి సంక్షేమ పథకాలు కట్ చేయాలన్న వాదనను ప్రభుత్వ వాదులు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమి చెప్పాలన్న అంశంపై ప్రజల్లో సంశయం నెలకొన్నది. ఇదే సమయంలో కాలం 30లో మీకు బ్యాంకు ఖాతా ఉందా..? లేదా? అనే ప్రశ్న ఉంది. కులవృత్తి దారులకు కూడా వార్షిక ఆదాయ వివరాలు సేకరించే విధంగా సర్వే ఫార్మాట్ ఉన్నది. అలాగే కాలం 31 నుంచి 40 వరకు భూముల వివరాలు సేకరించనున్నారు. అందులో ధరణి పాస్‌పుస్తకాలతో సహా తరి పట్టా, పడావు భూముల వంటి పూర్తి వివరాలు అడిగారు.
రైతు భరోసాను ఐదెకరాల వరకు మాత్రమే వర్తింప చేస్తామని ప్రభుత్వం చెబుతున్నది. ఈ నేపథ్యంలో ఈ వివరాల ఆధారంగా కోతలు పెడుతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఎకరాల ఆధారంగా సంక్షేమ పథకాలకు కత్తెర వేయొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే పార్టు-2లో ఇంటి యజమానులు స్థిర, చరాస్తుల వివరాలు అడుగుతున్నారు. నివాస గృహ విస్తీర్ణం నుంచి మొదలు ఇంటిలో గదుల సంఖ్య వరకు వివరాలు ఇచ్చే బాధ్యతలను ఎన్యుమరేటర్లకు అప్పగించారు.
ఈ సర్వేలో సేకరిస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే.. వేలాది మంది తెల్లరేషన్ కార్డులుంటాయా..? ఊడుతాయా..? అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకాన్ని రేషన్‌కార్డుతో ముడిపెట్టకుండా ఆరోగ్య శ్రీ కింద డిజిటల్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నది. ఈ నేపథ్యంలో కుటుంబ యజమాని స్థిర, చర ఆస్తుల వివరాలు ఇస్తే కార్డులు ఊడే ప్రమాదం లేకపోలేదన్న అనుమానాలు వస్తున్నాయి. నిజానికి ఆస్తులు మాత్రమే కాదు, అప్పుల వివరాలు కూడా సేకరిస్తున్నట్టు నమ్మించడానికి ప్రభుత్వం ఫార్మాట్లో ఒక అంశాన్ని చేర్చింది. అయితే రాష్ట్రంలో నూటికి 90 శాతం కుటుంబాలకు ఏదో రూపంలో అప్పు ఉంటుంది. అది ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద కావచ్చు, లేదా బ్యాంకుల్లో కావచ్చు.
పోనీ అప్పుల వివరాలు చెబితే ప్రభుత్వం ఏమైనా తీరుస్తుందా..? అంటే అటువంటి విషయం చరిత్రలో జరగలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ పరిస్థితుల్లోనూ తీర్చదు. అంటే అప్పు మాటున ఆస్తుల వివరాలు సేకరించడమే లక్ష్యంగా సర్వే చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఇళ్లు, ఇంటి విస్తీర్ణం, ఇంట్లో వాడుతున్న గదులు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని, ఇంటి కరెంటు బిల్లు మాఫీకి కూడా కోతలు పెట్టవచ్చన్న అనుమానాలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం సమగ్ర కుటుంబ సర్వేను ఒకే రోజు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సర్వే ఆధారంగా మరిన్ని సంక్షేమ క్యార్యక్రమాలను విస్తరించిందే తప్ప.. ఎటువంటి కోతలు పెట్టలేదు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడడం, ఆచరణలో అనేక పథకాల అమలుకు కొర్రీలు వేయడం, దీంతోపాటు రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాలపై ఎటువంటి స్పష్టత లేకుండా సాగదీయడం, అలాగే ఆరు గ్యారెంటీల అమలులో తిరకాసులు వంటి అంశాలను అధ్యయనం చేసి చూస్తే.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉండడంతో పాటు ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలకు వాత పెట్టడమే లక్ష్యంగా ఈ సర్వేలోని పలు అంశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సంపూర్ణ వివరాలు ఇస్తారా..? లేదా..? అన్న ఉత్కంఠ నెలకొనగా, సర్వేకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ప్రభుత్వం వెనుకబడిందన్న విమర్శలు వస్తున్నాయి.