దేశభక్తి ఉప్పొంగుతున్నది. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపుతున్నది. ఆదివారం 14వ రోజు జిల్లా వ్యాప్తంగా వనహోత్సవం అంబరాన్నంటింది. ఊరూరా చిన్నా పెద్దా కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటగా అంతటా పండుగ వాతావరణం కనిపించింది. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు పాల్గొనగా, ఎల్‌ఎండీకాలనీలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ విజయ, కలెక్టర్ కర్ణన్ మొక్కలు నాటి ఉత్సాహాన్ని నింపారు.
కరీంనగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): వజ్రోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. రోజుకో కార్యక్రమం నిర్వహిస్తుండడంతో ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తినింపుతున్నాయి. ఆదివారం 14వ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవం నిర్వహించారు. ఊరూరా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. కరీంనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని, మేయర్ సునీల్‌రావుతో కలిసి మొక్కలు నాటారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కులో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఆర్డీవో ఎల్ శ్రీలతా రెడ్డి, డీఎఫ్‌వో బీ వెంకటేశ్వర్ రావు, ఇరిగేషన్ ఎస్ఈ శివ ప్రసాద్ తదితరులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, నీరు పోశారు. హుజూరాబాద్ పట్టణంలో మొక్కలు నాటడమే కాకుండా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు.