Ameesha Patel : ఇప్పటికే చెక్‌బౌన్స్ కేసులో నటుడు రాజ్‌పాల్ యాదవ్ తిహార్ జైలులో ఉన్నాడు. అతడు బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యేలోపే ఇప్పుడు మరో బాలీవుడ్ నటి వివాదంలో చిక్కుకుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమీషా పటేల్‌పై చెక్ బౌన్స్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశంపై ఇన్స్టాగ్రామ్ వేదికగా హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. 2017లో నవంబర్ 16న అమీషా పటేల్ మొరాదాబాద్‌లో ఒక పెళ్లి వేడుకలో డాన్స్ చేయాల్సింది.
ఇందుకుగాను అడ్వాన్స్‌గా నిర్వాహకుడు పవన్ వర్మ ఆమెకు రూ.14.5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాడు. ఆమె కోసం హోటల్ రూం, ఫ్లైట్ టిక్కెట్స్ కూడా బుక్ చేశాడు. అయితే, ఆమె ఈవెంట్‌కు హాజరు కాలేదు. దీంతో నిర్వాహకుడు తనకు జరిగిన నష్టానికి తిరిగి డబ్బులు చెల్లించాల్సిందిగా అమీషాను కోరాడు. దీంతో మధ్యవర్తుల ద్వారా ఇరు పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఆమె అతడికి ఆ డబ్బు చెల్లించేందుకు అంగీకరించింది. మొదట రూ.10 లక్షలు నగదు రూపంలో చెల్లించింది. మిగతా రూ.4.5 లక్షలకు చెక్ ఇచ్చింది. కానీ, ఆ చెక్ బౌన్స్ కావడంతో నిర్వాహకుడు వర్మ తిరిగి అమీషాపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ అంశంలో ఇప్పటివరకు ఆమె కోర్టుకు హాజరుకాకపోవడంతో అమీషా పటేల్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
దీనిపై అమీషా పటేల్.. ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, ఇది చాలా కాలం నాటి కేసు అని ఆమె పేర్కొన్నారు. పవన్ తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని ఎదుర్కొనేందుకు తన న్యాయవాదుల బృందం ప్రయత్నిస్తోందని క్లారిటీ ఇచ్చారు. తను ఈ అంశంలో నిర్వాహకుడికి పూర్తి డబ్బు చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే, ఎవరి వాదనలో నిజం ఉందో మరికొంతకాలం తర్వాత తేలుతుంది.