జమ్మికుంట, ఆగస్టు 24: కులవృత్తులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, యాదవుల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్పష్టం చేశారు. జమ్మికుంట మండలం కోరపల్లిలో యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సర్కారు ఇటీవల రూ.10 లక్షలు మంజూరు చేసింది. భవన నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లతో ఊరేగారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ యాదవుల కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న యాదవులందరూ కులవృత్తిని కాపాడుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు. యాదవుల సంక్షేమం కోసం సీఎం పాటుపడుతున్నారని, ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు యాదవులను ఆదుకున్న సందర్భాలు లేవని చెప్పారు. యాదవులు నీతి, నిజాయితీపరులని, సీఎం కేసీఆర్ ఆశీర్వదించి ఇక్కడకు పంపించిన హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. యాదవులంతా ఒక్కతాటిపై నిలబడాలని, ప్రతిపక్షాలకు సత్తా చూపాలని కోరారు. ఇక్కడ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి శ్రీనివాస్‌రావు, ఎంపీపీ మమత, సర్పంచ్ రమ, ఎంపీటీసీ మమత, ఉప సర్పంచ్ ఓదెలు, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.