ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ గడ్డపై బీజేపీ విష సంస్కృతికి బీజం వేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భౌతిక దాడులకు తెరతీసింది. తప్పుమీద తప్పు అన్నట్టు ఒకే రోజు మూడు చోట్ల దాడులకు తెగబడి అరాచకం సృష్టించింది. నగరంలోని ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్‌లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై నేరుగా దాడికి విఫలయత్నం చేసింది. పోలీసుల సాక్షిగా కర్రలు, రాళ్లతో తెగబడగా, గన్మెన్లు అప్రమత్తమై గదికి తాళం వేయడంతో ప్రమాదం తప్పింది. కానీ, అక్కడితో ఆగకుండా క్యాంపు ఆఫీస్‌లో వీరంగం సృష్టించింది. అద్దాలు, పూలకుండీలు, కుర్చీలు, కిటికీలు, ఫర్నిచర్‌తోపాటు అక్కడే ఉన్న కౌశిక్‌రెడ్డి ఫార్చునర్ వాహనాన్ని ధ్వంసం చేసింది. ఈ ఘటన మరువక ముందే.. బీఆర్ఎస్ నాయకురాలు, సోషల్ మీడియా కార్యకర్త పావనిగౌడ్ ఇంటిపై దాడికి యత్నించింది.
ఇక్కడ చాలదన్నట్టు చివరికి హుజూరాబాద్ క్యాంపు కార్యాలయం వద్ద ఇదే తీరున విషం చిమ్మింది. ఈ ఘటనలన్నీ ఆ పార్టీ పెద్దల కనుసన్నల్లోనే ఒక పథకం ప్రకారమే జరిగాయన్న ప్రచారం జరుగుతుండగా, దాడిని బీఆర్ఎస్తోపాటు వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. దాడిలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నగరంలోని రెండు చోట్ల ఫిర్యాదు చేయడంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇది ఇలా ఉంటే.. ఇటీవలి కాలంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీస్ యంత్రాంగం వరుస వైఫల్యాలను మూట కట్టుకుంటున్నది. ఈ నెల 3న ఐదుగురు దుండగులు పిస్టల్స్‌తో వచ్చి నగల షాపులో దోపిడీ చేసిన ఘటన ఇంకా మరువక ముందే.. ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్రెడ్డిపై దాడికి యత్నించిన తీరు నిఘా వర్గాల వరుస వైఫల్యాను బయట పెడుతున్నది.
కరీంనగర్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కార్పొరేషన్/ విద్యానగర్ : భారతీయ జనతా పార్టీ బరితెగించిందన్న విమర్శలు వస్తున్నాయి. ఒకే రోజు మూడు చోట్ల దాడులకు యత్నించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ముందుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కర్రలతో దాడికి యత్నించారు. అక్కడ గన్మెన్లు అడ్డుపడడంతో క్యాంపు కార్యాలయంలో వీరంగం సృష్టించి, ఫర్నిచర్, అద్దాలు, కిటికీలు ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న కౌశిక్‌రెడ్డి వాహనం (ఫార్చునర్) అద్దాలను పగులగొట్టారు. అంతలోనే మరో కొంత మంది బీజేపీ, దాని అనుబంధ నాయకులు.. నగరంలోని బీఆర్ఎస్ నాయకురాలు, సోషల్‌మీడియా కార్యకర్త పావని గౌడ్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఈ విషయం ముందుగా తెలియడంతో బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకోగా, జారుకున్నారు. అక్కడితో ఆగకుండా ఈ విష సంస్కృతిని హుజూరాబాద్ వరకూ విస్తరించారు. కరీంనగర్ క్యాంపు కార్యాలయం నుంచి కౌశిక్‌రెడ్డిని హుజూరాబాద్ క్యాంపు కార్యాలయానికి తరలించారు. అక్కడికి వెళ్లగానే.. అక్కడ కూడా దాడి చేసేందుకు కొంత మంది బీజేపీ నాయకులు ప్రయత్నించిన తీరు, ఆ పార్టీ బరితెగింపునకు నిదర్శనమన్న అభిప్రాయాలు వస్తున్నాయి.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం! ఈ మధ్యకాలంలో వ్యక్తిగత విమర్శల పరంపర కూడా కొనసాగుతున్నది. నిజానికి వ్యక్తిగత విమర్శలపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో కరీంనగర్లో బీజేపీ మరో కొత్త విష సంస్కృతికి తెరలేపింది. తానే విమర్శలు చేయడం.. వాటిని తిప్పికొట్టేందుకు ప్రెస్మీట్లు పెట్టిన బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయడం వంటి వాటికి పూనుకుంటున్నది. తాజా ఘటనలే అందుకు నిదర్శనం. నిజానికి ఈ నెల 3న కరీంనగర్‌లోని పీఎంజే నగల షాపులో భారీ దోపిడీ జరిగింది. ఇది సాదాసీదా లూటీ కాదు, ఐదుగురు దుండగులు ఏకంగా పిస్టల్స్ పట్టుకొని, మోఖానికి మాస్కులు లేకుండా దర్జాగా దోచుకొని పరారయ్యారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేకపోయారు. నిజానికి ముఠా వినియోగించిన పిస్టల్స్, దోచుకున్న విధానం, నిర్వహించిన రెక్కీ తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించింది. ఆ మేరకు ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఈ నెల 4న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ వచ్చారు.
దాడిలో గాయపడిన సిబ్బందిని పరామర్శించడంతోపాటు పీఎంజే జ్యువెల్లరీని పరిశీలించి యజమానితో మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిజానికి బండి సంజయ్‌పై ఆ రోజు కేటీఆర్ ఎక్కువ విమర్శలు చేయలేదు. వ్యవస్థ పరమైన ప్రశ్నలు సంధించారే తప్పా వ్యక్తిగతంగా ఏమీ అన్న దాఖలాలు లేవు. ప్రధానంగా కేంద్ర మంత్రి ఇలాఖాలో ఇంత పెద్ద దోపిడీ జరిగితే.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజయ్ ఎందుకు అనడం లేదని, అలాగే ఏ విషయంలోనూ సీఎం రేవంత్‌రెడ్డిని ఒక్క మాట అనరని, ఏమైనా అంటే కాందీశీకుల భూముల వ్యవహారంలో ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడకుండా ఉంటున్నారు కావొచ్చని విమర్శించారు. అలాగే సందర్భం వచ్చినప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఎవరికి సహాయం చేస్తున్నారో అన్ని వివరాలు బయట పెడుతామని కేటీఆర్ అన్నారు. ఈ విమర్శపై బండి సంజయ్ అదే రోజు ఉలిక్కి పడినట్టు కనిపించింది. కేటీఆర్ ప్రెస్‌మీట్ ముగిసిన గంటలోపే కరీంనగర్లో ప్రెస్‌మీట్ పెట్టి మీడియా ఎదుట ఊగిపోయారు.

కాందీశీకుల భూముల వ్యవహారంలో తనకు, రేవంత్‌రెడ్డికి ఏమైనా లావాదేవీలు ఉంటే చూపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఇక్కడితో ఆగకుండా కేటీఆర్‌పై అతి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారంటూ కేటీఆర్‌ను విమర్శించారు. అయితే కాందీశీకుల భూముల వ్యవహారంపై అప్పటికప్పుడే బండి సంజయ్ స్పందించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలున్నాయి. ఒకటి రెండు రోజుల తర్వాత కూడా స్పందించవచ్చు. ఒకవేళ స్పందించినా ఆ విషయంపై మాట్లాడితే తప్పులేదు గానీ, అత్యంత వ్యక్తిగతంగా విమర్శలను చేశారు. అక్కడితో ఆగకుండా కేటీఆర్‌ను కరీంనగర్లో కాలు పెట్టకుండా తమ కార్యకర్తలు అడ్డుకుంటారని అదే రోజు ప్రకటించారు. ఇన్ని విమర్శలు చేసిన నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి గురువారం ఉదయం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి, పలు అంశాలపై మాట్లాడారు. ఆ క్రమంలోనే బండి సంజయ్ కేటీఆర్‌పై చేసిన విమర్శలపై స్పందించారు. ‘తంబాకు, డ్రగ్స్ తీసుకోవడం వల్లే నీకు తలపై వెంట్రుకలు ఊడిపోయి ఉండొచ్చు?’ అంటూనే, సరే ఏదేమైనా డ్రగ్స్ టెస్టుకు కేసీఆర్ సిద్ధమమని, నీవు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
నీవు నోరు పారేసుకుంటే తాము పారేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే బండి సంజయ్.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని, గీతా భవన్ చౌరస్తాలో చర్చకు మేము సిద్ధమని, కరీంనగర్ గడ్డ మీద నుంచి సవాల్ విసురుతున్నానని, సమయం నువ్వే చెప్పాలని, రావడానికి మేం రెడీ అని సవాల్ విసిరారు. ఇరిగేషన్, ఐటీ, సివిల్ సప్లైస్.. ఇలా ఏ సబ్జెక్ట్ మీదైనా సరే అర్థంపర్థం లేని విమర్శలు మానేసి చర్చకు వచ్చే ధైర్యం ఉన్నదా? అని ప్రశ్నించారు. ‘మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా మమ్మమ్మే, తత్తత్తే, బెబ్బెబ్బే’ అంటే కుదరదు సంజయ్’ అంటూ స్పష్టం చేశారు. బహుషా ఈ మాటలు బండికి మింగుడు పడలేదో.. లేక ఆయన అనుచరవర్గానికి మింగుడు పడేలేదో.. గానీ, ఏకంగా ఈ మాటలు మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై బీజేపీ గూండాలు దాడులకు యత్నించడం వారి విద్వేషానికి నిదర్శనమన్నా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి కౌశిక్‌రెడ్డి చేసిన విమర్శలు ఇబ్బందికరంగా ఉంటే.. వాటికి కౌంటర్ ఇవ్వాలే తప్పా దాడుల విషసంస్కృకి బీజం వేయడం ఏమిటన్న చర్చ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. అందులోనూ శాంతిభద్రతలకు పెద్దపీట వేయాల్సిన కేంద్ర మంత్రి అనుచరులే వీరంగం సృష్టిస్తే.. ప్రజల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అంటే బీజేపీ విద్వేష రాజకీయాలకు పురిగొల్పుతున్నట్టుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు దేశానికి వన్నె తెచ్చిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పుడు అపఖ్యాతిని మీదేసుకుంటున్నది. చీమ చిటుక్కుమన్నా పసిగట్టి, పని పట్టే పోలీస్ వ్యవస్థ ఇప్పుడు మాత్రం వరుస వైఫల్యాలను మూట కట్టుకుంటున్నది. ఇటీవలి కాలంలో మూడు నాలుగు చోట్ల ఏకంగా ఏటీఎంలను ఎత్తుకెళ్లిన దుండగులు.. తాజాగా అంటే గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఏటీఎంను దొంగలించారు. ఆ కేసు పురోగతి లేని సమయంలోనే.. ఈ నెల 3న కరీంనగర్ జిల్లా కేంద్రంలో నగల షాపులో దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగలు పిస్టల్స్‌తో కాల్పులు, భారీగా దోచుకెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దోపిడీ ముందు దుండగులు పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి ఏప్రిల్‌లోనే దాదాపు వారం పాటు పెద్దపల్లి జిల్లాకేంద్రంలో, మూడు రోజులు ధర్మపురిలోని ఓ లాడ్జీ మకాం వేశారు. ఐదుగురు దుండగులు.. ఐదు పిస్టల్స్‌తో రెండు జిల్లాల్లో ముందుగా మకాం వేసి, ఆ తర్వాత కరీంనగర్లో దోపిడీకి పాల్పడితే.. నిఘా వర్గాలు ఏమాత్రం పసిగట్టలేకపోయాయి.

అంతేకాదు, ఘటన జరిగి ఇన్ని రోజులైనా నేటికి వారిని పట్టుకోలేకపోయాయన్న వ్యక్తమయ్యాయి. ఇది ఇలా ఉంటే.. తాజాగా అంటే ఈ నెల 5న మరో ఘటన జరిగినట్టు కూడా తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గూనూరు చౌరస్తా వద్ద ఒక హైకోర్టు న్యాయవాదిని కొంత మంది తుపాకులతో బెదిరించినట్టు తెలిసింది. అంటే గన్‌కల్చర్ కరీంనగర్లో రాజ్యమేలుతుందని చెప్పడానికి ఈ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిని పసిగట్టడంలో పోలీసుల వైఫ ల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఇది ఇలా ఉంటే.. గురువా రం ఎమ్మెల్యే గంగుల క్యాంపు ఆఫీస్‌తోపాటు కౌశిక్‌రెడ్డిపై దాడి యత్నం అంశాన్ని పోలీసులు పసిగట్టలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ఘటన కొంత మంది పోలీసు అధికారులకు తెలిసే జరిగిందన్న ఆరోపణలున్నాయి. తెలిసి జరిగినా.. తెలియక జరిగినా వీటికి అడ్డుకట్టవేయాల్సిన బాధ్యత మాత్రం పోలీసులపైనే ఉంటుంది. కానీ, పసిగట్టడంలోనూ, అడ్డుకోవడంలోనూ విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నా యి. మొత్తం మీద ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోకపోతే.. మున్ముందు మరింత విష సంస్కృతి రాజ్యమేలే ప్రమాదముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరంగం సృష్టించిన నాయకుల తీరుపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారా..? లేక ఈ విషయంలోనూ పక్ష పాతం చూపుతారా..? అన్నది మున్ముందు తేలనున్నది.
బీజేపీ గూండాలు, నాయకులు సృష్టించిన విధ్వంస ఘటనను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ నెల 9న నగర బంద్‌కు పిలుపు నిచ్చింది. బీజేపీ అరాచకాలు, దౌర్జన్యాలను ప్రజలకు తెలియజేయాలన్న లక్ష్యంతో నగర బంద్‌కు పిలుపు ఇచ్చినట్టు బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని చెప్పారు. కానీ, దాడులు చేస్తూ బీజేపీ కొత్త విష బీజం నాటిందని, ఈ విష సంస్కృతిని అడ్డుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజాస్వామ్యంలో ఉన్న నాయకులు చేసే విమర్శలు అర్ధవంతంగా, హుందాగా, ఉండాలి. కానీ, ఇలా భౌతిక దాడులకు తెగబడడం, ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీస్ప బీజేపీ గూండాలు, కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ మనుషులు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నం సభ్యసమాజానికి సిగ్గుచేటు. హింసతో బీఆర్ఎస్ని అణచివేయాలని చూస్తున్నరు. అది వారితో అయ్యే పని కాదు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుమ్మకు రాజకీయాలు చేస్తున్నరు. వారి మధ్య అంతర్గత ఒప్పందం లేకపోతే రేవంత్ రెడ్డి ముందుగా సంజయ్‌పై చట్టపరంగా చర్యలకు ఆదేశాలు ఇవ్వాలి. దాడి చేసిన వారిని, ప్రోత్సహిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనుచరులు, బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడం అమానుషం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నించడం, వాహనం ధ్వంసం చేయడం ఏ మాత్రం సరైంది కాదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన సంజయ్ అనుచరులు ఇలాంటి దాడులకు దిగడం ఏంటి? దీనిపై సంజయ్ స్పందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి
ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి సరికాదు. అందులోనూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం చాలా తప్పు. విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పాలి లేదా ప్రతి విమర్శలు చేయాలే తప్ప దాడులకు దిగడం పద్ధతి కాదు. బిహార్ ముఠా మాదిరి రాజకీయాలను కరీంనగర్లో చేస్తున్నరు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే బీజేపీ నాయకులు గుండాల్లా ప్రవర్తిస్తున్నరు. నగరంలో ఇటీవల ఓ దోపిడీ జరిగితే హోం సహాయ శాఖ మంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..?. ఇంత దౌర్జన్యం పనికి రాదు. గుణపాఠం తప్పదు.
కరీం‘నగరం’లో బీజేపీ అరాచక పాలనకు దిగుతున్నది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా అక్కడే ఉన్న హుజూరాబాద్ ఎమ్మెల్యేపై దాడికి యత్నించి, కారును ధ్వంసం చేయడం దుర్మార్గం. కిరాయి ముఠాలను తీసుకువచ్చి దాడులు చేయించడాన్ని ఎవరూ సహించరు. ప్రజల శాంతి భద్రతల విషయమై మాట్లాడితే సమాధానం చెప్పడం చేతగాక దాడులకు దిగుతున్నరు. శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యక్తి, దేశానికి హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్న సంజయ్ తన అనుచరులను దాడులకు ఉసికొల్పడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి సంఘటనలను ప్రజలు తిరస్కరించాలి.
రాజకీయాల్లో దాడులు ప్రతిదాడులు ఉండవు. విమర్శలు ప్రతి విమర్శలు మాత్రమే ఉంటాయి. విమర్శలకు సమాధానం చెప్పడం చేతగాని వారే ఇలా దాడులకు దిగుతరు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్లో బీజేపీ కొత్త సంస్కృతిని తెస్తున్నది. దాడులకు దిగడం ఏమాత్రం సరికాదు. మాకు కేసీఆర్ పోరాటాలు చేయడమే నేర్పించిండు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి.