మంచిర్యాల, మే 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టి చూసుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేస్తున్నది. కల్లాలకు ధాన్యం తెచ్చి 20 రోజులైన కొనకపోవడం, కొన్న ధాన్యాన్ని 24 గంటల్లో తరలించకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని గంపలపల్లి, కొత్తూరులో 20 రోజుల క్రితం కల్లాలకు తెచ్చిన ధాన్యం వర్షానికి తడవకూడదని పరదాలు కప్పేందుకు వెళ్లి నలుగురు మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కారు అట్టర్ ప్లాఫ్ అయ్యిందనడానికి ఈ ఘటనే నిదర్శనం.
ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఈ సీజన్లో ధాన్యం, మక్కల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మక్కలు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ దండేపల్లి, హాజీపూర్, జైపూర్ మండలాల్లో రైతులు ఆందోళన బాట పట్టారు. కేసీఆర్ హయాంలో ఒకప్పుడు రైతు పండించిన ధాన్యం కొనడంలో జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
48 గంటల్లో డబ్బులు ఖాతాల్లో వేయడం చకచకా జరిగిపోయేవి. నేడు ఆ పరిస్థితి లేదు. అసలు ధాన్యం, మక్క కొనుగోళ్లపై ఆరా తీసే నాథుడు, కనీసం సమీక్ష నిర్వహించే పెద్ద దిక్కు లేడు. ఓ వైపు రైతుల ప్రాణాలు పోతున్నా.. కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి మారడం లేదు. దీంతో అన్నదాతలు సర్కారు తీరుపై మండిపడుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. రానున్న రోజుల్లో కొనుగోళ్ల సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు.
సర్కారు నిర్లక్ష్యం, క్షేత్రస్థాయిలో కొనుగోళ్లపై చూపుతున్న అశ్రద్ధ రైతులకు శాపంగా మారుతున్నది. మంచిర్యాల జిల్లాలోని చాలా మండలాల్లో కల్లాలకు వడ్లు వచ్చి 20 రోజులు అవుతున్నది. నిన్న నలుగురు రైతులు మృతి చెందిన రెండు చోట్ల గంపలపల్లి, కొత్తూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 20 రోజులైనట్లు రైతులే స్వయంగా చెప్తున్నారు. చిన్న చినుకుపడినా, ఈదురుగాలులు వీచిన కల్లాలకు పరుగెడుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే మంగళవారం నుంచి గురువారం వరకు పడిన వర్షాలతో చాలా చోట్ల మా ర్కెట్లు, కల్లాల్లో ధాన్యం, మక్క తడిసింది.
రైతుల రెక్కల కష్టం నీళ్లపాలైపోయింది. కానీ.. కొనుగోల్లు మాత్రం వేగం పుంజుకోలేదు. చాలాచోట్ల కొనుగోళ్లు మొదలవలేదు. వాస్తవానికి యాసంగిలో తప్పతాలు తక్కువగా ఉంటుంది. కానీ.. తాలు పేరిట ఎక్కువ తూకం పెడుతున్నారు. ధా న్యం కొంటే చాలు ఎంత తూకమైన పెట్టుకోనిద్దామంటే రైతుల నుంచి ఒక్కో బస్తాకు రూ.2 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇంత దోపిడీని తట్టుకున్నా.. సమయానికి కొనుగోళ్లు లేక, కొ న్న ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు తరలించే నాథుడు లేక క్షేత్రస్థాయిలో రైతులు అవస్థలు పడుతున్నారు. వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల్లో తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
