రాజన్న సిరిసిల్ల, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : తాగి వాహనం నడుపుతూ డ్రంక్ పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. డ్రంక్ అండ్డ్రైవ్లో రెండు లేదా మూడుసార్లు దొరికిన వాహనదారుల లైసెన్సు రద్దు చేయాలని సంబందిత రవాణా శాఖకు సిఫారసు చేస్తామని చెప్పారు. సిరిసిల్ల ఆర్టీవో కార్యాలయంలో గురువారం పోలీస్, ఆర్టీవో శాఖలు సంయుక్తంగా నిర్వహించిన లైసెన్స్ మేళాలో ఆయన పాల్గొని, దరఖాస్తు చేస్తుకున్న యువకులకు లైసెన్సులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా మంది డ్రైవింగ్ లైసెన్సు లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారని, రోడ్డు భద్రతపై అవగాహన లేక ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి సమయాల్లో లైసెన్సు లేకపోతే ప్రమాద బీమా వర్తించదని చెప్పారు. అందుకే 18 ఏళ్లు నిండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికీ లైసెన్స్ ఉండాలన్న ఉద్దేశ్యంతో లైసెన్స్ మేళాకు శ్రీకారం చుట్టామని తెలిపారు. దరఖాస్తుదారులకు ఆన్లైన్ డ్రైవింగ్ పరీక్షలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి నిర్ణీత రుసుముతో లైసెన్సు ఇస్తున్నామన్నారు.
మొదటి విడుత మేళాలో వంద మందికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేశామని చెప్పారు. ఇప్పుడు రెండో విడుత మేళాలో 700 మంది యువతీ, యువకులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తొలివిడుత వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన 30మందికి లర్నింగ్ లైసెన్సులు అందజేశామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, సీఐలు కృష్ణ, శ్రీనివాస్, డీటీవోలు లక్ష్మణ్, వంశీధర్, రజనీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో తలనీలాల సేకరణ హక్కులు పొందిన కాంట్రాక్టర్ గతేడాది ఏప్రిల్ నుంచి నగదు చెల్లించడం లేదు. డిసెంబర్ వరకే సుమారు 6 కోట్ల 75 లక్షలు బాకీ కట్టాల్సి ఉన్నది. దాంతో కల్యాణకట్టలో నిల్వ ఉంచిన తలనీలాలను అధికారులు స్వాధీనం చేసుకొని భద్రపరుస్తున్నారు. పదకొండు డబ్బాల్లో నిల్వ ఉన్న సుమారు రూ.కోటికిపైగా విలువైన తలనీలాలను గురువారం రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్పై ఆరబెట్టి, భద్రత కోసం ఇద్దరు కానిస్టేబుళ్లను పహారా ఉంచారు. అయితే ఈ రక్షణ ఎందుకనేగా మీ అనుమానం? తలనీలాలు కిలోకు మార్కెట్లో వేలల్లో ధర పలుకుతుండగా.. ఆ మాత్రం భద్రత ఉండదా..!
– వేములవాడ, జనవరి 2