హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 12: ఢిల్లీ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల లొల్లి మనకెందుకని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్, కొత్తపల్లి, దమ్మక్కపేట గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ల రిమోట్ ఢిల్లీలోనే ఉంటదని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకే ఇక్కడి నాయకులు పనిచేస్తారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొంత పార్టీ అని గుర్తు చేశారు. తన స్వలాభం కోసమే ఈటల రాజీనామా చేసి, బీజేపీలో చేరాడని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతులు, అభాగ్యులు, బడుగు, బలహీన వర్గాలకు అనేక పథకాలతో అండగా నిలిచిన ఆయనకు మనమంతా అండగా నిలువాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన గెల్లు శ్రీనివాస్, ఇప్పుడు ఈ నియోజకవర్గ బాగు కోసం కొట్లాడుతాడని పేర్కొన్నారు. ఈ నెల 30న నిర్వహించే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.
హోరెత్తిన ప్రచారం
హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పలనర్సింగాపూర్, దమ్మక్కపేట, కొత్తపల్లి, బోర్నపల్లి, ఇందిరానగర్‌లో టీఅర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నిర్వహించిన ఇంటింటా ప్రచారంహోరెత్తింది. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులతో గెల్లుకు ఘన స్వాగతం పలికారు. ‘జై తెలంగాణ’ నినాదాలతో వీధులు మార్మోగాయి. డప్పుచప్పుళ్లతో ర్యాలీలు తీశారు. కారుగుర్తుకే ఓటు వేస్తామని హామీ ఇచ్చారు.
ఒక్కిల్లూకట్టియ్యలె..
ప్రజలంతా ఓట్లేసి గెలిపిస్తే నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టియ్యలేకపోయాడని, ఇప్పుడు బీజేపీలో చేరి ఈటల ఏం చేస్తడని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే, మంత్రిగా అవకాశం ఇచ్చి పెద్దోడిని చేసిన సీఎం కేసీఆర్‌నే తిడుతున్నాడని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పుడు పేదింటి బిడ్డగా తనకు అవకాశం ఇచ్చారని, నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌కు మెడికల్ కాలేజీ మంజూరు చేయించడంతోపాటు డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి చేయించి ఇస్తానని హామీనిచ్చారు. భూమి ఉన్న వారికి ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షలు వచ్చే విధంగా సీఎంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు. ఈ ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి, తనను గెలిపించాలని అభ్యర్థించారు. కౌన్సిలర్లు గోవిందుల స్వప్న, దండ శోభ, బోరగాల శివ, కవిత, మహిపాల్‌రెడ్డి, నాయకులు దండ విక్రమ్‌రెడ్డి, గూడూరి ప్రభాకర్‌రెడ్డి, స్వామిరెడ్డి, జీవన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, అకుల మొగిలి తదితరులు పాల్గొన్నారు.
-టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్
గెల్లు గెలిస్తే నేను గెలిచినట్టే
టీఅర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే తాను గెలిచినట్లేనని, అయన వెంట ఉంటూ మీ సేవ చేసుకునే అవకాశం కల్పించాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను కోరారు. అరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉండి హుజూరాబాద్‌కు ఈటల రాజేందర్ చేసిందేమీ లేదన్నారు. తన ఆస్తులను ఎలా కాపాడుకోవాలనే తపనే ఈటలకు ఉందని, నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే ఆలోచన లేదని దుయ్యబట్టారు. గెల్లు శ్రీనివాస్ గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధికి కేరాఫ్‌గా మారుతుందని, ఈటల గెలిస్తే ఆపార్టీకి అసెంబ్లీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు మరొకరు తోడవుతారన్నారు.