జమ్మికుంట/ ఇల్లందకుంట/కమలాపూర్, అక్టోబర్ 18: కారు జోరు కొనసాగుతున్నది. వివిధ పార్టీల నుంచి తరలివస్తున్న నేతలతో దూకుడు పెంచింది. కొద్దిరోజులుగా బీజేపీ నాయకులు వందలాదిగా తరలివస్తూ చేరిపోతుండగా, ప్రతిపక్షాల్లో కంగారు మొదలైంది. కాగా, సోమవారం జమ్మికుంటలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు, జమ్మికుంట పట్టణాధ్యక్షుడు కసుబోజుల వెంకటేశ్వర్లు(ఎన్ఎస్యూఐ వెంకన్న), మంజుల(మాజీ వైస్ ఎంపీపీ)తో పాటు మున్సిపల్ పరిధిలోని 25వార్డులకు చెందిన నాయకుల రాజీనామా చేయడం కోలుకోని దెబ్బతీసింది.
జమ్మికుంటలో కాంగ్రెస్ ఖాళీ..?
హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, జమ్మికుంట పట్టణశాఖ అధ్యక్షుడు కసుబోజుల వెంకటేశ్వర్లు(ఎన్ఎస్యూఐ వెంకన్న), మంజుల(మాజీ వైస్ ఎంపీపీ)తో పాటు మున్సిపల్ పరిధిలోని 25వార్డులకు చెందిన నాయకులంతా సోమవారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం పోకడ, ఉప పోరులో అభ్యర్థి ఎంపికను నిరసిస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేయగా, నేడో, రేపో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ ఖాళీకానుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్‌లో పనిచేయలేం..
‘మతతత్వ పార్టీ బీజేపీ అభ్యర్థి ఈటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారు. స్థానికేతరుడికి టికెట్టిచ్చారు. ఇక్కడి నాయకుల అభిప్రాయాలు తీసుకోవడం లేదు. 30ఏండ్లుగా అనుబంధ సంఘంల, పార్టీల పనిచేసినం. పనిచేసే నాయకులకు గుర్తింపులేదు. మనస్తాపానికి గురైనం. కాంగ్రెస్‌లో పనిచేయలేం. అందుకే అందరం రాజీనామా చేస్తున్నం.’ అని సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న, జిల్లా అధికార ప్రతినిధి ఎండీ సలీం, పట్టణ అధికార ప్రతినిధి యెగ్గని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జమ్మికుంటలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడారు. విద్యార్థిగా 1992 నుంచి ఎన్ఎస్యూఐలో పనిచేశానని, ఎన్నో ఉద్యమాలు చేపట్టిన విషయాలను వివరించారు. ఇన్నేండ్లుగా పనిచేసినా కనీసం ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటించే క్రమంలో స్థానిక నాయకులను సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టినా కూడా పార్టీలో ఎలాంటి మార్పు లేదన్నారు. ముక్కు, మోహం తెలియని వ్యక్తికి బీ ఫాం ఇవ్వడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలతో రేవంత్ కుమ్మక్కయ్యారని హుజూరాబాద్ ప్రజలు చర్చించుకోవడం తట్టుకోలేక పోతున్నామన్నారు. రాజీనామాలను డీసీసీ అధ్యక్షుడికి పంపించామని తెలిపారు. తమ భవిష్యత్ కార్యాచరణ ఒకట్రెండు రోజుల్లో సమష్టి నిర్ణయం తీసుకుని తెలియజేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు మల్లయ్య, నాగేంద్ర, రాజమౌళి, అంజి, శంకర్, తదితరులున్నారు. కాగా, నేడో, రేపో రాజీనామా చేసిన నాయకులు మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం.
సిరిసేడులో బీజేపీ నాయకుల జై..
ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన బీజేపీ నాయకులు పలువురు సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చేరిన వారిలో బీజేపీ నాయకులు గొట్టె రాజశేఖర్, దాసారపు సంతోష్, రేణికుంట్ల రాజీర్, రౌతు సాగర్ తదితరులు ఉన్నారు. వీరందరికి ఎమ్మెల్యే రవిశంకర్ టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్తోనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని పార్టీలో చేరినట్లు తెలిపారు.
బీజేపీ యూత్ అధ్యక్షుడు..
కమలాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల యూత్ అధ్యక్షుడు కౌడగాని రాకేశ్ సహా పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వీరికి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో నాయకులు మల్యాల గణేశ్, మంద పవన్, మంద రాజ్‌కుమార్, ఎండీ రియాజ్, ఎండీ పాషా, తరిగొప్పుల చందుతోపాటు గూడూరుకు చెందిన మణ్యంపులి యూత్ సభ్యులు పాక రాజు, పాక లక్ష్మణ్, వంగ శ్రీశైలం, పాక రాము, బాషబోయిన రాజేందర్, వంగ కుమారస్వామి, బాషబోయిన కుమారస్వామి, పాక నాగరాజు, నన్నబోయిన చంద్రమౌళి, నన్నబోయిన అశోక్, పాక అంజి ఉన్నారు. ఇక్కడ సర్పంచ్ అంకతి సాంబయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఇమ్మడిశెట్టి చంద్రశేఖర్, విజేందర్ ఉన్నారు.