మోడల్ స్కూల్ పార్ట్టైమర్ల కడుపుమాడుతున్నది. జీతాలు అందక పీడీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్, ఇతర సిబ్బంది బతుకు ఆగమైపోతున్నది. ఇచ్చేదే అంతంత మాత్రం.. అందులోనూ ఐదునెలలుగా ఇవ్వకుండా ప్రభుత్వం సతాయిస్తుండడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 220 మంది జీవితం దుర్భరంగా మారింది. అప్పులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకపోగా, రెండు రోజుల కింద జగిత్యాలకు చెందిన సిబ్బంది ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం పరిస్థితికి అద్దం పడుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చెల్లించాలని డిమాండ్ వినిపిస్తున్నది.
జగిత్యాల, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005లో ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్‌ను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. సర్వశిక్షా అభియాన్ పథకం నుంచి ప్రత్యేక నిధులు రావడంతో దేశంలో ఉన్న చాలా రాష్ర్టాల్లో ప్లస్ టూ (6 నుంచి 12వ తరగతి వరకు) పాఠశాలలు ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి ఉపాధ్యాయులు, పీజీటీలను ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్మెంట్ చేసుకున్నది. ప్రతి పాఠశాలలో ప్రిన్సిపాల్ పోస్టుతోపాటు టీజీటీలు, పీజీటీల పోస్టులు మంజూరు చేసి, భర్తీ చేశారు.
కానీ, పీఈటీలు, పీడీ, ఇతర క్లరికల్ పోస్టులను మాత్రం భర్తీ చేయలేదు. దీంతో స్కూళ్లలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 13 ఏండ్ల క్రితం రాష్ట్రంలో ఉన్న ప్రతి మోడల్ స్కూల్లోనూ పీడీ (వ్యాయామ ఉపాధ్యాయుడు), కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, నైట్ వాచ్మెన్లను పార్ట్‌టైమ్ పద్ధతిలో నియమించింది. అందులో ఫిజికల్ డైరెక్టర్‌కు నెలకు 22,750, కంప్యూటర్ ఆపరేటర్‌కు 19,500, ఆఫీస్ సబార్డినేట్‌కు 15,500, నైట్ వాచ్‌మన్‌కు 15,500 వేతనంగా నిర్ధారించారు. ఏడాదిలో పన్నెండు నెలలకు వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. జగిత్యాల జిల్లా పరిధిలో 13 తెలంగాణ మోడల్ స్కూల్స్ ఉండగా, అందులో 52 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 220 మంది సిబ్బంది పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ స్కూల్ పార్ట్‌టైమ్ ఉద్యోగులు రిక్రూట్మెంట్ అయినా వారికి స్వరాష్ట్రంలో కేసీఆర్ హయాంలోనే న్యాయం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ పార్ట్‌టైమ్ ఉద్యోగులకు తక్కువ వేతనాలను చెల్లిస్తూ వచ్చారు. పీడీకి 7వేలు, కంప్యూటర్ ఆపరేటర్‌కు 6వేలు, మిగిలిన రెండు కేటగిరీల వారికి నెలకు 4వేలు చెల్లించారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ప్రభుత్వోద్యోగులకు బేసిక్‌లో 42 శాతం వేతనాలను పెంచారు.
ఆ సమయంలో మోడల్ స్కూల్ పార్ట్‌టైమ్ ఉద్యోగులకు సైతం పెరిగాయి. పీడీలకు 10వేల వేతనం కాగా, మిగిలిన వారికి కొంత తక్కువ వేతనాలు వచ్చాయి. 2017లో మరోసారి, 2022లో ఇంకోసారి కేసీఆర్ ప్రభుత్వం వారికి వేతనాలను పెంపుచేసింది. ఈ పెంపు వల్ల పీడీలకు 22,750, కంప్యూటర్ ఆపరేటర్లకు 19,500, ఆఫీస్ సబార్డినేట్, నైట్‌వాచ్‌మెన్‌కు 15,500 చొప్పున చెల్లించడం ఆరంభించారు. ఏడాదిలో మే నెలలో మూడు నెలలు వీరిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించి, 27రోజుల వేతనాన్ని (రెగ్యులరైజేషన్, ఇతర న్యాయ చిక్కులను అధిగమించడానికి) చెల్లిస్తూ వచ్చారు.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడల్ స్కూల్లో పనిచేస్తున్న 220 మంది పార్ట్‌టైమ్ ఉద్యోగులకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. రెగ్యులర్‌గా వేతనాలు చెల్లించే ప్రక్రియ నిలిచిపోయింది. మొదటి ఏడాది వేతనాల చెల్లింపులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, ఈ ఏడాది ప్రారంభం నుంచి పూర్తిగా గాడితప్పాయి. మార్చి వరకు పార్ట్‌టైమ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించిన ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి వీరికి జీతాలు చెల్లించడం నిలిపివేసింది.
ఏప్రిల్, మే నెలల్లో వేతనాలు మంజూరు చేయలేదు. విద్యా సంవత్సరం ఆరంభమై మూడు నెలలు గడుస్తున్నా, వేతనాలు మంజూరు కాకపోవడంతో పార్ట్‌టైమ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. పలుసార్లు ప్రజాప్రతినిధులను కలిసి తమకు వేతనాలు మంజూరయ్యేలా చూడాలని కోరినా ప్రయోజనం దక్కలేదు. చివరకు విధి లేని పరిస్థితుల్లో జగిత్యాలకు చెందిన మోడల్ స్కూల్ పార్ట్‌టైమ్ ఉద్యోగులు సోమవారం ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌కు తమ వేతనాలు చెల్లించేలా చూడాలంటూ వినతిపత్రం ఇచ్చారు.
ఐదు నెలలుగా వేతనాలు మంజూరు చేయలేదు. పార్ట్‌టైమ్ ఉద్యోగులందరం గోస పడుతున్నాం. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటున్నా, ఇవ్వడం లేదు. వేతనాలు రాక నిత్యావసర వస్తువులతోపాటు పిల్లల ఫీజులు చెల్లింపు, వైద్య ఖర్చులు, తల్లిదండ్రుల పోషణకు అవస్థలు పడుతున్నాం. వేతనాలు పెంచుతారని, ఉద్యోగాన్ని క్రమబద్ధీకరిస్తారని అనుకున్నాం. కానీ వేతనాలు రావడమే పెద్ద సమస్య అవుతుందని అనుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి.
– కొప్పుల గంగాధర్, వ్యాయామ ఉపాధ్యాయుడు (వెల్గటూర్)
ప్రభుత్వం మోడల్ స్కూల్లోని పార్ట్‌టైమ్ ఉద్యోగులకు ఇస్తున్నదే అరకొర వేతనం. అందులోనూ ఐదు నెలలుగా ఆపితే ఎలా..? అప్పులు చేసి, కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి నెలకొన్నది. అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. జీతాలు ఎప్పుడు మంజూరు చేస్తారు సార్ అంటూ విద్యాశాఖ, ట్రెజరీ శాఖలకు వెళ్లి అడిగితే బడ్జెట్ రాలేదు. బడ్జెట్‌కు ఆథరైజేషన్ రాలేదంటూ సమాధానాలు చెబుతున్నారేగానీ వేతనాలు ఇవ్వడం లేదు. మా పరిస్థితి ఏంటో మాకే అర్థమైతలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని కనికరించి, వేతనాలు మంజూరు చేసి ఆదుకోవాలి. లేదంటే కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడుతున్నది.