గంగాధర, జూలై 12: క్రీడారంగం అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో 20 గుంటల నుంచి ఎకరం వరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ఆటస్థలం చదును చేయించడం, క్రీడా పరికరాల ఏర్పాటు కోసం ఉపాధి హామీ నిధులు రూ. 4.16 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మండలంలో 33 గ్రామాలు ఉండగా 22 గ్రామాల్లో క్రీడా మైదానాల కోసం స్థల సేకరణ చేశారు. ఇప్పటికే గట్టుభూత్కూర్, కురిక్యాల, రంగరావుపల్లి, గర్శకుర్తి, ర్యాలపల్లి గ్రామాల్లో క్రీడా మైదానాలు పూర్తయ్యాయి. 17 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల పనులు ప్రగతిలో ఉన్నాయి.
క్రీడా పరికరాలు ఏర్పాటు
గ్రామాల్లో ఎకరం స్థలాన్ని శుభ్రం చేసి ఆటలు ఆడుకునేందుకు వీలుగా సిద్ధం చేశారు. క్రీడలకు సంబంధించిన కొలతల మేరకు మైదానాన్ని తీర్చిదిద్దారు. గ్రౌండ్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌కు సంబంధించి కోర్టులు వేస్తున్నారు. వ్యాయామం చేయడానికి సింగిల్ బార్, డబుల్ బార్ ఏర్పాటు చేస్తున్నారు. క్రీడా ప్రాంగణంలో ఇనుప, వుడ్ పోల్స్, పాదచారులు వాకింగ్ చేయడానికి చుట్టూ ట్రాక్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఐదు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు పూర్తయ్యాయి. మిగతా గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన క్రీడా ప్రాంగణాల పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు.
మొక్కల పెంపకం
క్రీడా ప్రాంగణానికి వచ్చే వారికి ఆహ్లాదాన్ని పంచేందుకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. వేప, గుల్మోర్, బాదం, కానుగ వంటి నీడనిచ్చే మొక్కలతో పాటు పూలు, పండ్ల మొక్కలు నాటుతున్నారు. ఉపాధిహామీ పథకం కింద మొక్కల సంరక్షణకు నిధులు కేటాయించడంతో పాటు గ్రామ పంచాయతీల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
పనులు వేగంగా జరుగుతున్నయి
క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నయి. రెవెన్యూ అధికారుల సహకారంతో ఇప్పటికే 22 గ్రామాల్లో ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాలను గుర్తించినం. ఐదు గ్రామాల్లో సర్పంచులు, అధికారుల సహకారంతో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చినం. 17 గ్రామాల్లో పనులు వేగంగా జరుగుతున్నయి. త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తం. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తాం.
-చంద్రశేఖర్, ఉపాధి హామీ ఏపీవో
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
గ్రామంలో ఎకరం స్థలంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినం. గత నెల 9న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. యువకులు, క్రీడాకారులు రోజూ మైదానానికి వచ్చి ఆటలు ఆడుతున్నరు. యువకులు శారీరకంగా, మానసికంగా ఎదగడానికి క్రీడా ప్రాంగణాలు దోహదపడుతయ్. క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌కు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు.
-విజేందర్‌రెడ్డి, సర్పంచ్, గట్టుభూత్కూర్
క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి
గ్రామంలో సుమారు ఎకరం స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్టులు వేయించినం. వ్యాయామం చేయడానికి అనువుగా డబుల్, సింగిల్ బార్లు ఏర్పాటు చేసినం. వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసిన. ఇక్కడికి వచ్చే వారికి ఆహ్లాదం పంచడానికి క్రీడా ప్రాంగణం చుట్టూ మొక్కలు నాటుతున్నం. ఆటలు, వ్యాయామంతో శారీరక, మానసికోల్లాసం కలుగుతుంది. గ్రామంలోని యువకులు క్రీడా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకోవాలి.
-మేచినేని నవీన్‌రావు, సర్పంచ్, కురిక్యాల