కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 4: అది మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామం. అక్కడ పాఠశాల ఉన్నా పాతబడిపోయింది. పిల్లల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో అక్కడ విధుల్లో చేరిన ప్రధానోపాధ్యాయుడు ఎర్ర సతీశ్ బాబు గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయుల సహకారంతో బడిని బలోపేతం చేశారు. విద్యార్థుల సంఖ్య పెంచడంతోపాటు వారిని అన్ని విధాలా తీర్చిదిద్దుతూ ఆదర్శంగా నిలిచారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం సతీశ్‌బాబును ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక చేయగా, నేడు హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకోనున్నారు.
ప్రవేశ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ
పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడమే కాకుండా, వారందరికీ నాణ్యమైన విద్యను అందించడంలో ముఖ్య పాత్ర పోషించారు హెచ్ఎం సతీశ్‌బాబు. రెండు నెలలకు ఒకసారి తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల ప్రగతిని తెలియజేస్తూ ముందు సాగారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం గురుకుల, మోడల్ స్కూల్స్ ప్రవేశాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు అర్హత సాధించారు. ఇదే క్రమంలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ సతీశ్‌కుమార్ తనదైన ముద్ర వేసుకున్నారు.
ఆహ్లాదకరంగా పాఠశాల ఆవరణ
విద్యార్థులకు విద్యనందించడంతో పాటు హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో 450 మొకలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పారు. రోజూ విద్యార్థులతో కలిసి మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టారు. ముగ్గురు నుంచి నలుగురు విద్యార్థులకు ఒక మొక్క బాధ్యత అప్పగించి మంచి ఫలితాలు సాధించారు.
ఎక్కడ పనిచేసినా..
సతీశ్ బాబు తాను ఎక్కడ పని చేసినా ఆ పాఠశాలను అభివృద్ధి చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో ముందు సాగారు. ఈ క్రమంలోనే తిమ్మాపూర్ మండలం బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో 2001 నుంచి 2006 వరకు విద్యార్థుల సంఖ్య 25 ఉండగా, దాన్ని 30 వరకు పెంచారు. అలాగే, కోనరావుపేట మండలం బావుసాయిపేట ప్రాథమిక పాఠశాలలో 2013లో విద్యార్థుల సంఖ్య 60 ఉండగా, 2016 సంవత్సరానికి దానిని 130కి చేర్చారు.
పెరిగిన విద్యార్థుల సంఖ్య..
ఊటూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్యలో పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో 2018కి ముందు 42 మంది ఉన్న ఆ పాఠశాలలో సతీశ్‌బాబు వచ్చిన 2019లో విద్యార్థుల సంఖ్య 66కి పెరిగింది. అలాగే, 2019-20 విద్యా సంవత్సరంలో 66 నుంచి 116కు, 2020-21లో 116 నుంచి 143కు, 2021-22లో 143 నుంచి 150కి విద్యార్థుల సంఖ్య పెంచారు.
సంతోషంగా ఉంది..
సర్కారు పాఠశాలకు చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించడం సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనందించాలి. వాటి అభివృద్ధికి తోడ్పాటునందించాలి. దీనికి తగిన గుర్తింపు ఉంటుందనేందుకు ప్రభుత్వం నన్ను రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక చేయడమే నిదర్శనం.
ప్రొజెక్టర్, కంప్యూటర్ ద్వారా పాఠాలు
విద్యార్థులకు మంచి విద్య, సులువుగా అర్థమయ్యే రీతిలో అందించాలనే లక్ష్యంతో పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, దాతల సహకారంతో ప్రొజెక్టర్, కంప్యూటర్ సమకూర్చారు. విద్యార్థులు తమ పాఠశాల గురించి, ఉపాధ్యాయులు అందిస్తున్న ప్రోత్సాహం గురించి అందరికీ వివరించగా, ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు కూడా సర్కారు బడి బాట పట్టారు.
ఆకట్టుకుంటున్న రైలు బడి..
ఊటూరు గ్రామంలో ఏండ్ల క్రితం నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం కళ తప్పగా, ఆయన దాని రూపురేఖలు మార్చివేశారు. దాతల సహకారంతో పాఠశాలను రైలు బండి మోడల్లో తీర్చిదిద్ది అందరి చూపు దాని వైపు మళ్లేలా చేశారు. 2020 సంవత్సరంలో ఈ కార్యక్రమానికి పూనుకోగా, తర్వాత అనేక మంది విద్యార్థులు ఈ పాఠశాలకు ఆకర్షితులై అడ్మిషన్లు పొందారు.