చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర మండలం బొమ్మకంటిపల్లిలో డ్రాగన్ ఫ్రూట్ పంట పరిశీలన
గంగాధర, ఫిబ్రవరి 23: రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మండలంలోని బూర్గుపల్లి పంచాయతీ పరిధిలో గల బొమ్మకంటిపల్లిలో రైతు సుంకె అంజయ్య సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పంటల సాగులో రైతులు మార్గదర్శకులు కావాలన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తెచ్చిందన్నారు. రైతును రాజుగా చూడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల నిజమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, బీడు భూముల్లో బంగారం పండించేలా చేయూతనందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వినూత్న పంటల సాగుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేస్తున్న రైతు అంజయ్యను అభినందించి, శాలువాతో సత్కరించారు. ఇక్కడ ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
రామడుగు, ఫిబ్రవరి 23: ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండల ఉప సర్పంచుల ఫోరం నూతన కమిటీ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను గంగాధర మండలం బూర్గుపల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచుల ఫోరం సభ్యులు ఎమ్మెల్యేకు పలు సమస్యలపై వినతిపత్రం అందించగా, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధిలో ఉప సర్పంచులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. అంతకు ముందు మండల కేంద్రంలో ఉప సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాపోలు అంజయ్య (కొక్కెరకుంట), ఉపాధ్యక్షులుగా పూదరి వెంకటేశ్ (వెలిచాల), రాజేందర్ (రామడుగు), కార్యదర్శిగా మేడి శ్రీనివాస్ (గుండి), సహాయ కార్యదర్శిగా ఎడవెల్లి సత్యనారాయణరెడ్డి (వెదిర), కోశాధికారిగా గుడ్ల శేఖర్ (రంగశాయిపల్లి)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా రత్నాకర్‌రెడ్డి, సుధగోని మహేశ్, వెంకటనర్సయ్య, రమ్య, స్వప్న, కనకయ్య, గోపాల్ కొనసాగనున్నారు.