కరీంనగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : దళితబంధు లబ్ధిదారులు అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా సంవత్సరం లోపు రెట్టింపు ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో దళితబంధు పథకం మొదటి 15 మంది లబ్ధిదారులకు జిల్లా అధికారులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనిట్ల ఎంపికకు తొందరపడొద్దని, తగిన సమయం ఇస్తామని తెలిపారు. లబ్ధిదారులు బ్యాంకులో జీరో అకౌంట్ ఉన్నవారు కూడా కొత్తగా దళితబంధు అకౌంట్ ఓపెన్ చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులతో చర్చించి యూనిట్‌పై ఆలోచించుకోవాలన్నారు. యూనిట్ల ఎంపికకు జిల్లా అధికారులతో పూర్తి అవగాహన పెంపొందిస్తామని భరోసా ఇచ్చారు. యూనిట్ల నిర్వహణకు 10 నుంచి 15 రోజులు పూర్తి స్థాయిలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని, తక్కువ సమయంలో ఎకువ ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలన్నారు. కాగా, 15 మంది లబ్ధిదారులలో కొందరు బర్రెలు(డెయిరీ యూనిట్లు), గూడ్స్ ట్రేలర్, ట్రాక్టర్ ట్రేలర్, ఎర్టిగా కారు, సూపర్ బజార్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, లేడీస్ ఎంపోరియం యూనిట్లు ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. వాహనాలు ఎంపిక చేసుకున్న వారికి బుధవారం లర్నింగ్ లైసెన్స్‌లు జారీ చేయాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ను ఆదేశించారు. డెయిరీ యూనిట్లను ఎంచుకున్న వారిని కరీంనగర్ డెయిరీకి తీసుకెళ్లి నిర్వహణ, దాణా, పాలు తీయడం, ఎలా మారెటింగ్ చేయాలనే విషయాలపై పూర్తి అవగాహన పెంపొందించాలని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారిని ఆదేశించారు.
వీరికి 5 బర్రెలు, షెడ్డు నిర్మాణం, ఇన్సూరెన్సు, ఒక సంవత్సరం దాణాకు అయ్యే మొత్తం ఖర్చుకు ప్రణాళికలు తయారు చేసి సమర్పించాలని ఆదేశించారు. అలాగే, మెడికల్‌షాపు యూనిట్ ఎన్నుకున్న వారికి ఫార్మసిస్ట్ సర్టిఫికెట్తో లైసెన్సు ఇప్పించాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల షాపు యూనిట్లను ఎంచుకున్న వారికి అవసరమైన లైసెన్సును ఇప్పించాలని వ్యవసాయాధికారిని ఆదేశించారు. కిరాణం షాపులు, టెంట్ హౌస్ యూనిట్లు ఎంపిక చేసుకుంటే అనుకున్న స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశాలు తకువని, ప్రతి గ్రామంలో ఎకువ కిరాణం, టెంట్‌హౌజ్ షాపులు ఉన్నాయని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం నవీన్‌కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి నేతనియల్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ నరేందర్, ఎల్డీఎం లక్ష్మణ్, ఆర్‌సెట్ మేనేజర్ దత్తాత్రేయ, నాబార్డు ఏజీఎం అనంత్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.