కమలాపూర్, ఆగస్టు 17: హుజూరాబాద్‌లో యువకులను ఉసిగొల్పి వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించి సానుభూతి పొందేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. యువకులను సెల్ టవర్లు ఎక్కించి, బీజేపీ నాయకులు వారి కార్లపై వాళ్లే రాళ్లు వేయించుకుని టీఆర్ఎస్పై నెట్టే ప్రయత్నం చేయబోతున్నట్లు పక్కా సమాచారం ఉందని పేర్కొన్నారు. కమలాపూర్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోషామహల్ ఎన్నికల్లో రాజాసింగ్, దుబ్బాకలో రఘునందన్‌రావు చేసిన నీచపు ఎత్తుగడలే రాబోయే ఎన్నికల్లో ఈటల రాజేందర్ అవలంబించే అవకాశం ఉందన్నారు. అవసరమైతే వీల్‌చైర్, అంబులెన్స్‌లో ప్రచారం చేసి సానుభూతితో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నదన్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎందుకు తెచ్చిండో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ప్రజలకు ఏం చేస్తవో, బీజేపీ ఏం చేస్తదో చెప్పకుండా సీఎం కేసీఆర్‌ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నాడని విమర్శించారు. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌లో ప్రారంభిస్తే అభినందించాల్సి పోయి విమర్శిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేను చేసి, రెండుసార్లు మంత్రి పదవి ఇచ్చినపుడు కేసీఆర్‌లో కనిపించిన మంచితనం ఇపుడు ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు. భూకబ్జాలపై ఫిర్యాదులు వస్తే విచారణకు ఆదేశిస్తే అప్పటి మంచోడు ఇప్పుడు చెడ్డోడు అయ్యారా? అని నిలదీశారు. ఏడేండ్లు నియోజకవర్గాన్ని నియంతలా పాలించిన నిన్ను ఏమనాలి రాజేందర్? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ కేసీఆర్‌పై చేస్తున్న ఆరోపణలు సత్యదూరమన్నారు. ఆయన కప్పుకొన్నది కాషాయ జెండా అయితే ఎర్రజెండా మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. తాము టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తుంటే, ఈటల మాత్రం గోడ గడియారాలు, కుట్టు మిషన్లు, మందు బాటిళ్లను నమ్ముకున్నాడని విమర్శించారు. దీనిని ఆత్మగౌరవం అంటారో.. ఆత్మవంచన అంటారో? ఈటలనే చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు బీజేపీ చేసింది శూన్యం
ఏడేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ర్టానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చిందా? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందా? కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చిందా? ఏం చేసిందో చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిలదీశారు. కేంద్రం తెలంగాణ ప్రాజెక్టులు, నీళ్లపై ఆధిపత్యం కావాలంటుంటే ఇక్కడి బీజేపీ నాయకులకు ఏం చేస్తున్నరని మండిపడ్డారు. రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చట్టం చేసింది, రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తెచ్చింది కేంద్రమేనన్నారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీని విక్రయిస్తున్నందుకు బీజేపీకి ఓటెయ్యాలా? అని ప్రశ్నించారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లోని నల్లదనం తీసుకువచ్చి జన్‌దన్ ఖాతాల్లో రూ.15లక్షల చొప్పున వేస్తానన్న ప్రధాని మోదీ హామీలు ఏమయ్యాయని విమర్శించారు. హుజూరాబాద్‌లో మాటలతో మభ్య పెడుతున్న బీజేపీని కాదని, ఇచ్చినవే కాకుండా ఇవ్వని హామీలను నెరవేరస్తున్న టీఆర్ఎస్ను ఇక్కడి ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారని ధీమా వ్యక్తంజేశారు. దళితబందు పథకం ప్రారంభోత్సవానికి భారీగా తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఇన్చార్జి డాక్టర్ పేరియాల రవీందర్రావు, సర్పంచుల ఫోరం కన్వీనర్ పెండ్యాల రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సంపత్‌రావు, కేడీసీసీబీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, కో ఆప్షన్ సభ్యుడు చోటేమియా, నాయకులు నవీన్‌కుమార్, ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాస్, అశోక్, విజయ్, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.