మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Feb 16, 2020 , 03:14:53

మున్సిపల్‌ చట్టానికి అనుగుణంగా అభివృద్ధి పనులు

మున్సిపల్‌ చట్టానికి అనుగుణంగా అభివృద్ధి పనులు

విద్యానగర్‌ : మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా మున్సిపల్‌ చట్టానికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్‌ శరత్‌ కుమార్‌ అన్నారు.  కలెక్టర్‌ చాంబర్‌లో మున్సిపల్‌ వార్డు అభివృద్ధిపై శనివారం సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మున్సిపల్‌ కమిషనర్లు నాలుగు వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. హరితహారం, శానిటేషన్‌, చెత్త సేకరణ, స్వచ్ఛ ఆటోలు, పన్నుల వసూలు, డంప్‌ యార్డ్‌, వైకుంఠధామం, పబ్లిక్‌ టాయిలెట్స్‌, విద్యుత్తు స్తంభాల మరమ్మతులు, ప్లాంటేషన్‌లో 10 ఫీట్‌ మొక్కలు నాటడం, ప్రతి ఇంటికీ కృష్ణ తులసి మొక్కలు పెంచడం, తాగునీటి సరఫరా, పార్కులు, మార్కెట్లు మొదలైన పనులను నిర్వహించాలని సూచించారు. ఆయా పనులు నిర్వహించేందుకు మున్సిపల్‌ కమిషనర్లు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, యువత, మహిళలు, సీనియర్‌ సిటిజన్లు, ప్రముఖులతో 4 వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. 


షెడ్యూలు కులాల నుంచి 60 శాతం, షెడ్యూలు తెగల నుంచి 5 శాతం, బీసీ కులాల నుంచి 30 శాతం, ఇతరులు 5 శాతం ప్రాతినిధ్యం వహించాలని సూచించారు. వార్డుల వారీగా కమిటీలను పర్యవేక్షించేందుకు స్పెషల్‌ ఆఫీసర్లుగా జిల్లా అధికారులు ఏర్పాటు చేస్తామని, వీరు రిజిష్టర్‌ను ఏర్పాటు చేసి ప్రొఫార్మా ద్వారా పనుల పురోగతిపై సమీక్షిస్తారని చెప్పారు. వార్డు కమిటీల నియామకం ఫిబ్రవరి 19 నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. పన్నుల వసూలలో వంద శాతం పురోగతి సాధించాలన్నారు. మున్సిపాలిటీల్లో పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఏర్పాటుకు తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్లు చర్యలు చేపట్టాలన్నారు. అటవీ శాఖ ద్వారా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఎఫ్‌ఆర్‌వోలను అనుసంధానం చేయాలన్నారు. ప్రతి ఇంటికీ ఒక కొబ్బరి మొక్క నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 17న పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు మున్సిపల్‌ కమిషనర్లు పాఠశాలలు, కార్యాలయాలను గుర్తించాలన్నారు. మున్సిపాలిటీల్లో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న సిబ్బందికి పీఎఫ్‌, ఇన్సూరెన్సు అందించేలా చూడాలని సూచించారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేశ్‌ దోత్రే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపల్‌ కమిషనర్లు, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.logo
>>>>>>