సోమవారం 18 జనవరి 2021
Jagityal - Nov 23, 2020 , 01:12:15

నర్సన్న సన్నిధిలో భక్తుల రద్దీ

నర్సన్న సన్నిధిలో భక్తుల రద్దీ

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. పవిత్ర కార్తీక మాసంతో పాటు ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు మొదట పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలాచరించి సంకల్పాది పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన దేవాలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో కూలైన్లలో బారులుతీరి స్వామివారలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా బ్రాహ్మణులకు దీపదానాలు చేసుకున్నారు. ఆలయంలో గల ఉసిరిక చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. 

కొనసాగిన గోదావరి హారతి..

కార్తీక మాసం సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో గోదావరి హారతి కార్యక్రమం ఏడు రోజులుగా వైభవంగా జరుగుతున్నది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆలయం నుంచి వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాలతో వెంటరాగా అర్చకులు సిబ్బంది, భక్తులు గోదారి నది వరకు శోభాయాత్రగా వెళ్లారు. అనంతరం వేద పండితులు బొజ్జ రమేశ్‌శర్మ తదితర బ్రాహ్మణులు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు నదిలో కార్తీక దీపాలను వదిలారు. కార్యక్రమంలో దేవస్థాన సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, ఆలయ ఉపప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, అభిషేక్‌ పురోహితులు బొజ్జ సంపత్‌కుమార్‌, తదితరులు ఉన్నారు.