e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జగిత్యాల ప్రతి మండలానికి ఒక లైబ్రరీ

ప్రతి మండలానికి ఒక లైబ్రరీ

ప్రతి మండలానికి ఒక లైబ్రరీ

గ్రంథాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి
స్టడీ సర్కిల్స్‌తో అనుసంధానం చేస్తే ఎంతో మేలు
ఆన్‌ డిమాండ్‌ పద్ధతిలో పుస్తకాలు సమకూర్చుతాం
ప్రతి బిడ్డకు ఉన్నత విద్యను అందించడమే లక్ష్యం
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకవర్గ అభినందన సభకు హాజరు
పాల్గొన్న ఎమ్మెల్యేలు,ఇతర ప్రముఖులు

జగిత్యాల, జూన్‌ 15 (నమస్తే తెలంగాణ): “ప్రతి మండలానికి ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలోని గ్రంథాలయాలను, స్టడీ సర్కిల్స్‌తో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, అలా చేస్తే విద్యార్థులకు, పోటీ పరీక్షలు రాసే వారికి అధిక ప్రయోజనాలు చేకూరుతాయని’ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన పాలకవర్గం అభినందన సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో గ్రంథాలయాలు ఆదరణ లేక నీరసించి పోయాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో లైబ్రరీలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ప్రతి జిల్లాలోనూ జిల్లా గ్రంథాలయ శాఖలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రతి గ్రంథాలయానికి పూర్తిస్థాయి భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేసిందని చెప్పారు. ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్స్‌ను మంజూరు చేస్తున్నామని, వాటితో గ్రంథాలయాలను అనుసంధానం చేయాలన్నారు.

స్టడీ సర్కిల్స్‌, గ్రంథాలయాలు సమిష్టిగా ముందుకు సాగినప్పుడు యువత, విద్యార్థులకు మేలు జరుగుతుందని వివరించారు. జగిత్యాల జిల్లా గ్రంథాలయానికి ఇప్పటికే స్థల కేటాయింపు జరిగిందని, అలాగే భవన నిర్మాణం కోసం రూ.కోటి మంజూరయ్యాయని, కొత్త పాలకవర్గం వీలైనంత త్వరగా స్థలాన్ని ఆధీనంలోకి తీసుకొని భవన నిర్మాణం చేపట్టాలన్నారు. గ్రంథాలయ సంస్థకు నిధులు అవసరమైతే మరిన్ని మంజూరు చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జగిత్యాల జిల్లా అయిన తర్వాత అన్ని సౌకర్యాలు కల్పించుకుంటున్నామన్నారు. నిజామాబాద్‌ ఎంపీగా కవిత ప్రాతినిధ్యం వహించిన సమయంలో జగిత్యాల జిల్లాలో అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయని, భవిష్యత్తులోనూ జగిత్యాల అభివృద్ధికి ఎమ్మెల్సీ కవిత కృషి చేయాలని ఆయన కోరారు.

- Advertisement -

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పటిష్టమైన లైబ్రరీ వ్యవస్థ అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. విద్యతోనే వివేకం, వివేకంతోనే వికాసమన్నారు. చదువు ఉన్నప్పుడే ఏది మంచి, ఏది చెడు అన్న అంశంపై అవగాహన వస్తుందన్నారు. అనేక పుస్తకాలు చదివిన విజ్ఞానంతో సీఎం కేసీఆర్‌ తెలంగాణ విముక్తిలో కీలకపాత్ర పోషించి, చాలా మంది విఫలమైన చోట విజయం సాధించారని పేర్కొన్నారు. పుస్తకం చాలా గొప్పదని, పైసా ఖర్చులేకుండా, మనిషిని మరో ప్రపంచంలోకి తీసుకుపోయే మహత్తర శక్తి అని అభివర్ణించారు. జగిత్యాల జిల్లాలో ఎస్సీ స్టడీ సర్కిల్‌ మంజూరైందని, బీసీ స్టడీ సర్కిల్‌ను సైతం మంజూరు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగిత్యాలలోని 15మండలాల్లో లైబ్రరీలు ఉన్నాయని, మరో మూడు మండలాల్లో సైతం ఏర్పాటు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కోరారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కొత్త లైబ్రరీకి త్వరలో శంకుస్థాపన చేయాలని సూచించారు. జగిత్యాల లైబ్రరీని మోడల్‌ లైబ్రరీగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. జగిత్యాలకు ఇప్పటికే మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు మంజూరు అయ్యాయని, గ్రంథాలయ భవనం సైతం త్వరగానే పూర్తవుతుందని చెప్పారు. తెలంగాణలోని ప్రతి బిడ్డకూ ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయన్నారు. బడుగు, బలహీనవర్గాల ఆదరాభిమానాలు ఉన్న టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో పటిష్ట రాజకీయ శక్తిగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని పేర్కొన్నారు. గ్రంథాలయ సంస్థ పాలకవర్గం అభినందన సభ సందర్భంగా బీసీవర్గాలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ఔన్నత్యాన్ని ప్రకటించి, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపడం సంతోషంగా ఉందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు నివేదిస్తామని చెప్పారు.

గ్రంథాలయ సంస్థ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో 21 జిల్లాల గ్రంథాలయాలకు బడుగు, బలహీనవర్గాల వారే చైర్మన్లుగా ఉన్నారని, మిగిలిన 11 మంది చైర్మన్లు బీసీ వర్గాలకు చెందినవారని చెప్పారు. గ్రంథాలయ పాలకవర్గాలే సీఎం కేసీఆర్‌ పాలన సమతుల్యత శక్తికి అద్దం పడుతాయన్నారు. సీఎం కేసీఆర్‌ పుస్తక ప్రియుడని, గ్రంథాలయాలను గొప్పగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. గ్రంథాలయాల్లో ఆన్‌ డిమాండ్‌ పద్ధతిలో పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. విద్యార్థులు, పాఠకులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాల వివరాలను గ్రంథాలయాల్లో అందజేస్తే పది రోజుల్లో వాటిని తెప్పించి అందుబాటులో ఉంచుతున్నామన్నారు. యాభై ఏండ్లకు సరిపోయే విధంగా అన్ని వసతులతో గ్రంథాలయాల భవన నిర్మాణాలుండాలని సీఎం కేసీఆర్‌ సూచించారని, ఆ దిశలోనే నిర్మాణాలు చేపడుతున్నామన్నారు.

జగిత్యాల గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్‌ గౌడ్‌, విద్యావంతుడని, అతడి మిత్రులు, ఇతర ప్రొఫెషనల్స్‌తో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, జగిత్యాల జిల్లాలో, బీసీ వర్గాల్లో బలమైన నాయకుడు, విద్యావేత్త అయిన చంద్రశేఖర్‌ గౌడ్‌ను గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. చంద్రశేఖర్‌గౌడ్‌ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఎమ్మెల్యే సుంకె రవి శంకర్‌ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ బడుగు, బలహీనవర్గాల పక్షపాతి అని కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల వారికి మేలు చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు, ఇచ్చిన పదవులే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 63లక్షల మంది రైతులకు రైతు బంధు పథకం కింద 7,509 కోట్లు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. బలహీనవర్గాలకు చెందిన చంద్రశేఖర్‌ గౌడ్‌ను గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమించడం ఆనందాన్ని కలిగించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంథాలయాలను సైతం సంస్కరించి, అక్కడ సైతం మంచి పుస్తకాలను అందుబాటులోకి తేవాలన్నారు.

ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు దేవి ప్రసాద్‌ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ పుస్తక ప్రియుడని, పుస్తకాల అధ్యయనం నుంచి సంగ్రహించిన జ్ఞానంతోనే తెలంగాణ రాష్ట్ర సాధనను పూర్తి చేశారని కొనియాడారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్‌ గౌడ్‌ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సీఎం కేసీఆర్‌ తెలంగాణ జాతిపితగా మారారని కొనియాడారు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, గ్రంథాలయాలను ఆదర్శవంతంగా మార్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇక్కడ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దావ వసంత, జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, ఆర్థిక సంఘం చైర్మన్‌ రాజేశంగౌడ్‌, రాయికల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు, డీసీఎంస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ సభ్యులు మారంపెల్లి బాబు, ఉప్పుల నాగభూషణం, పుప్పాల ఉమారాణి, లావుడ్య సంధ్యారాణి, జాజాల భీమేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రతి మండలానికి ఒక లైబ్రరీ
ప్రతి మండలానికి ఒక లైబ్రరీ
ప్రతి మండలానికి ఒక లైబ్రరీ

ట్రెండింగ్‌

Advertisement