Zelensky vs Donald Trump | వాషింగ్టన్: నిత్యం ప్రశాంతంగా ఉండే వైట్ హౌస్ శుక్రవారం ఇద్దరు దేశాధినేతల వాగ్వాదంతో దద్దరిల్లింది. ఎవరూ తగ్గకపోవడంతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య జరిగిన సమావేశం రసాభాసగా మారింది. అమెరికా ఏం చేయాలో చెప్పవద్దంటూ జెలెన్స్కీని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో రష్యాతో యుద్ధంపై శాంతి, ఉక్రెయిన్‌లో అరుదైన ఖనిజాల తవ్వకాలకు సంబంధించిన ఒప్పందాలు జరగకుండానే జెలెన్స్కీ వైట్‌హౌస్ నుంచి నిష్క్రమించారు.
ఉక్రెయిన్‌లో ఖనిజాల వెలికితీత, రష్యాతో యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికాతో ఒప్పందానికి శుక్రవారం అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ ఒప్పందం ద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా సాయాన్ని ఉక్రెయిన్ పొందుతుందని అందరూ ఆశించారు. అయితే శ్వేత సౌధంలో ఇద్దరు నేతల మధ్య జరిగిన సమావేశంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు నేతలు మీడియా, పలువురు దౌత్యవేత్తల సమక్షంలో రష్యా యుద్ధం గురించి గొడవవడ్డారు. మూడో ప్రపంచ యుద్ధంతో జూదం ఆడుతున్నారని, అమర్యాదగా ఉన్నారంటూ జెలెన్స్కీని ట్రంప్ నిందించగా, దానికి జెలెన్స్కీ దీటుగా బదులిచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రస్తావిస్తూ హంతకుడితో రాజీ పడకూడదని అంటూ రష్యాపై ట్రంప్ వైఖరి ఏమిటని సూటిగా ప్రశ్నించారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం కొనసాగించకపోతే అమెరికా ‘భవిష్యత్తులో దాని ప్రభావాన్ని చవి చూస్తుంది’ అని జెలెన్స్కీ చేసిన హెచ్చరికపై ట్రంప్ ఆయనను ఆపి ‘మేమేమవుతామో మాకు చెప్పకండి. ఒక సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు. సామరస్యంగా ప్రారంభమైన సమావేశం వీరి వాదనలు, వాగ్వాదాలతో వేడెక్కడంతో ట్రంప్ సమావేశాన్ని ఆకస్మాత్తుగా ముగించారు.
ఉక్రెయిన్ దురాక్రమణకు పుతిన్‌ను బాధ్యుడిని చేయాలంటూ జెలెన్స్కీ చర్చల సందర్భంగా పట్టుబట్టారు. అదే సమయంలో రష్యా రెండో దాడిని చేయదన్న తన నమ్మకాన్ని ట్రంప్ పునరుద్ఘాటించారు. దీంతో 10 నిముషాల పాటు సమావేశంలో వాతావరణం వేడెక్కింది. ‘నువ్వు చాలా చెడ్డ స్థితిలో ఉన్నావు, నీకు మరో అవకాశం లేదు’ అని ట్రంప్ అనగా, తాను కార్డులు ఆడటం లేదని జెలెన్స్కీ బదులిచ్చారు. ‘లేదు.. నువ్వు ఆటలు ఆడుతున్నావు. లక్షలాది మంది ప్రజల జీవితాలతో జూదం ఆడుతున్నావు. మూడో ప్రపంచ యుద్ధంతో జూదం ఆడుతున్నావు. నువ్వు చేస్తున్నదంతా నీ దేశాన్ని అగౌరవపరుస్తుంది, చాలామంది చెప్పినట్టు మీకు మద్దతు ఇచ్చిన దాని కంటే ఎక్కువ’ అని ట్రంప్ బదులిచ్చారు. ఉక్రెయిన్‌కు కనుక అమెరికా మిలిటరీ సామగ్రి అందజేయకపోతే యుద్ధం రెండు వారాల్లో ముగిసేదని అన్నారు.
అమెరికా అధ్యక్షుడితో చర్చల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన వైఖరిని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు. ‘మా దేశ భూభాగంలో మేము ఉంటున్నాం. మేము అక్కడ ఉండేందుకు ఎవరి అనుమతి తీసుకోవాలి? మేం ఎవరికీ తల వంచే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే అమెరికా మా దేశాన్ని రక్షించాలని కోరుతున్నాను.’ అని జెలెన్స్కీ చర్చల్లో స్పష్టం చేశారు.
రెండు దేశాల మధ్య సమావేశం అర్ధాంతరంగా ముగియడంతో జెలెన్స్కీ, ఆయన బృందం తక్షణం వైట్ హౌస్‌ను విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు వచ్చినట్టు అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఈ పరిణామాల పట్ల ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మారకరోవా ఆందోళన చెందారు. ట్రంప్‌తో వాగ్వాదం అనంతరం వైట్‌హౌస్ నుంచి బయటకు వచ్చిన జెలెన్స్కీ ఉక్రెయిన్ ఆవేదనను వినాలని ప్రపంచ దేశాలను కోరారు.
ఉక్రెయిన్‌కు అమెరికా చేసిన వందల బిలియన్ డాలర్ల నిధుల సహాయానికి సంబంధించిన లెక్కలను తమకు పంపాలని ట్రంప్ ఆ దేశాన్ని డిమాండ్ చేశారు. ఇరు దేశాల మధ్య చర్చల్లో ఏర్పడిన ప్రతిష్ఠంభన అనంతరం శనివారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఘర్షణ తర్వాత యూరోపియన్ భాగస్వామ్య దేశాలతో పాటు ఇతర ప్రపంచ నాయకులు జెలెన్స్కీకి మద్దతు ప్రకటించారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ‘అలాగే పటిష్ఠంగా, ధైర్యంగా, భయం లేకుండా ఉండు. నీవు ఎప్పటికీ ఒంటరివి కావు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫిన్లాండ్ ప్రధాని పీటర్ ఆర్ఫన్, లుక్సంబర్గ్ దేశ ప్రధాని లుక్ ఫ్రైడన్, పోలెండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా తదితరులు జెలెన్స్కీని ప్రశంసిస్తూ సందేశం పంపారు.