న్యూఢిల్లీ: తైవాన్ సమస్యను సరిగ్గా నిర్వహించకపోతే ఇరు దేశాల మధ్య ఘర్షణలు, వివాదాలు తలెత్తే అవకాశం ఉందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించారు. ఇరాన్ యుద్ధం, ఇంధన భద్రత, వాణిజ్యంపై విస్తృత చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ హెచ్చరిక వెలువడింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన మొదటి విడత చర్చలు అనంతరం సెప్టెంబర్ 24న వైట్ హౌస్‌ను సందర్శించాలని చైనా అధ్యక్షుడు, ఆయన భార్యను ట్రంప్ ఆహ్వానించారు. ఇంధన స్వేచ్ఛా ప్రవాహానికి మద్దతుగా హొర్ముజ్‌ను తెరిచి ఉంచాలని ఇరువురు నాయకులు అంగీకరించినట్లు వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటన పేర్కొన్నది.
వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన నిర్మాణాత్మక చైనా-అమెరికా బంధాన్ని నిర్మించాలనే కొత్త దృక్పథంపై తాను అధ్యక్షుడు ట్రంప్‌తో ఏకీభవించినట్లు జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఈ నూతన దృక్పథం రానున్న మూడేండ్లలో, ఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సంబంధాలకు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని, దీన్ని ఇరు దేశాల ప్రజలు, అలాగే అంతర్జాతీయ సమాజం కూడా స్వాగతించాలని జిన్‌పింగ్ పేర్కొన్నట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. అయితే తైవాన్ సమస్య చైనా-అమెరికా సంబంధాలలో అత్యంత కీలకమైనదని, దాన్ని సక్రమంగా నిర్వహిస్తే ద్వైపాక్షిక సంబంధాలు పూర్తి స్థిరత్వంతో కొనసాగుతాయని చైనా అధ్యక్షుడు స్పష్టం చేశారు.