India : ఆపరేషన్ సిందూర్, సర్జికల్స్ స్ట్రైక్స్‌తోనే ఖంగుతిన్న పాకిస్తాన్ పైకి మాత్రం గంభీరం ప్రదర్శిస్తోంది. నిరంతరం ఇండియాపై కుట్రలు చేస్తూనే.. తాము మాత్రం సుద్ధపూసలమైనట్లు ప్రవర్తిస్తుంది. తాజాగా ఇండియాకు పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంపై తప్పుడు ఆరోపణలతో ఇండియా కనుక దాడి చేస్తే, తాము కోల్‌కతాపై దాడి చేసి చూపిస్తామని పాక్ హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తాజా వ్యాఖ్యలు చేశారు.
పాక్‌లోని సియాల్కోట్లో అసిఫ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ‘‘ఒకవేళ పాకిస్తాన్‌పై ఏదైనా తప్పుడు ఆరోపణలతో ఇండియా దాడి చేస్తే ఈసారి మేం కోల్‌కతాను స్వాధీనం చేసుకుంటాం. భారతీయుల ద్వారాగానీ, లేదా ఇండియాలో పట్టుబడ్డ పాకిస్తాన్ పౌరుల్ని తీవ్రవాదులుగా చూపించి, వారిని అడ్డం పెట్టుకుని ఏదైనా తప్పుడు ఆపరేషన్ చేపడితే, మేం కోల్‌కతా వరకు వస్తాం’’ అని అసిఫ్ హెచ్చరించారు. అయితే, ఈ ఆరోపణలకు ముందే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇదే తరహాలో పాకిస్తాన్‌కు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇదే అదనుగా భావించి, ఇండియాపై పాకిస్తాన్ ఏదైనా దాడికి పాల్పడితే ఈసారి గట్టిగా బదులిస్తామని రాజ్‌నాథ్ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదన్నారు.
అయితే, ఇండియాతో పాకిస్తాన్ నేరుగా యుద్ధం చేయడం లేదు. కానీ, తీవ్రవాదుల్ని అడ్డుపెట్టుకుని ఇండియాలో దాడులకు, విధ్వంసానికి కుట్ర చేస్తోంది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో నలుగురు ఉగ్రవాదుల ముఠా పట్టుబడింది. వీరికి పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలతో లింకులున్నట్లు తేలింది. అంతకుముందు కూడా కొందరు ఉగ్రవాదుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు.