Asim Munir | ఆపరేషన్ సిందూర్‌తో భారత్ చేత చావుదెబ్బ తిన్నప్పటికీ దాయాది పాకిస్థాన్ తీరులో ఎలాంటి మార్పూ లేదు. తాజాగా పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ (Pak army chief) సయ్యద్ అసిం మునీర్ (Asim Munir) మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన భారత్ (India)పై నోరు పారేసుకున్నారు. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణుయుద్ధానికి దిగుతామంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగారు. తాము నాశనమైతే.. తమతోపాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సింధునది వివాదాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌పై నోరుపారేసుకున్నారు. సింధు నది భారతీయుల ఆస్తిఏమీ కాదంటూ వ్యాఖ్యానించారు. ఆ నదిపై భారత్ డ్యామ్‌లు నిర్మించే వరకు ఎదురు చూస్తామని చెప్పారు. తమ వద్ద క్షిపణులకు ఎలాంటి కొదవ లేదని, ఆ డ్యామ్‌లను పది క్షిపణులతో పేల్చేస్తామని హెచ్చరించారు. భారత్ నుంచి తమ అస్థిత్వానికి ముప్పు ఏర్పడితే, తాము నాశనం అవుతూనే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
కాగా, అసిం మునీర్ (Asim Munir) యూఎస్ సందర్శనకు వెళ్లడం రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈఏడాది జూన్‌లో అసిం మునీర్ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ట్రంప్ వైట్ హౌస్‌లో మునీర్‌కు ప్రత్యేకంగా విందు కూడా ఇచ్చారు. ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో.. వాషింగ్టన్‌తో పాకిస్థాన్ సంబంధాలు బలపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
Ecuador | ఈక్వెడార్‌లో కాల్పులు.. 8 మంది మృతి
Turkey Earthquake | టర్కీలో భూకంపం.. 16 భవనాలు నేలమట్టం.. వీడియోలు
Pak | భారతీయ విమానాలకు ఎయిర్‌స్పేస్ మూసివేత.. పాక్‌కు రెండునెలల్లో రూ.1240 కోట్లు లాస్..!