Ecuador | దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో ఆదివారం రాత్రి బుల్లెట్ల వర్షం కురిసింది. గయా ప్రావిన్స్‌లోని శాంటా లుసియాలోని ఓ నైట్ క్లబ్ వద్ద దుండగులు తుపాకులతో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారంతా 20 నుంచి 40 ఏండ్ల లోపు వయసు వారేనని పోలీసులు తెలిపారు.
గయా ప్రావిన్స్‌లోని శాంటా లుసియా ప్రాంతం అతి భయంకరమైన ప్రాంతం. ఈ ప్రాంతంలోకి దుండగులు బైకులపై వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈక్వెడార్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈక్వెడార్‌లో తరుచుగా అల్లర్లు, ఆందోళనలు కొనసాగుతుంటాయి. రెండు రోజుల క్రితం ఈఐ ఓరో ప్రావిన్స్‌లో బోటు వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 1.8 కోట్ల జనాభా ఉన్న ఈక్వెడార్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 4600 మంది అల్లర్లలో చనిపోయారు. గతేడాది ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లో 8 వేల మంది చనిపోయారు.