– సమస్యలు పరిష్కారించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం
– రైతు బందు సమితి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
– కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత
రామగిరి, ఫిబ్రవరి 18 : ఆన్లైన్ యూరియా యాప్‌తో ఎరువుల పంపిణీలో అనేక అవస్థలు ఏర్పాడుతున్నాయని, అసైన్ చేసిన భూములను గుర్తించక పోవడంతో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు, పంట నష్టాలు ఎదుర్కొంటున్నట్లు రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు చింతారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైతులతో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అమల్లో ఉన్న తప్పనిసరి ఆన్లైన్ యూరియా యాప్‌తో ఎరువుల పంపిణీ విధానం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారన్నారు. ఇది రైతుల రాజ్యాంగ బద్దమైన హక్కులకు భంగం కలిగించే పరిస్థితిని సృష్టించిందని, తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. కాగా తనకు 18.18 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని వ్యవసాయ ప్రమాణాల ప్రకారం ప్రతీ ఎకరా పంటకు ఒక సంచి యూరియా అవసరమవుతుందన్నారు. కానీ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 18 సంచుల స్థానంలో కేవలం 12 సంచుల యూరియా మాత్రమే సరఫరా చేశారని మిగిలిన సంచులు ఇప్పటి వరకు అందలేదన్నారు.
ఇదే విషయం వ్యవసాయ అధికారులకు తెలిపితే 15 రోజుల తర్వాత మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించారన్నారు. ఇది పంటకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని యూరియా ఎరువు పంపిణీ వ్యవస్థలో ఉన్న లోపాలను తక్షణమే సవరించాలని, రైతుల భూమి విస్తీర్ణాన్ని సరైన రీతిలో గుర్తించి అవసరమైన పరిమాణంలో యూరియా సరఫరా చేయాలని, అసైన్ చేసిన భూములను సహితం పరిగణంలోకి తీసుకుని ఎరువులను కేటాయి నిర్ధారణ చేయాలని, ఆలస్యంతో సరఫరా జరగపోతే నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. ఆన్‌లైన్‌తో పాటు మాన్యువల్ విధానాన్ని సహితం అందుబాటులో ఉంచి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. స్మార్ట్‌ఫోన్, ఆన్లైన్ అందుబాటులో లేక చాలా మంది రైతులు యూరియా తీసుకోలేక పోతున్నారని, ఓటీపీ ధృవీకరణ సమస్యలు వస్తున్నాయని తెలిపారు.
పలు సందర్భాల్లో రైతులకు 50 నుంచి 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న దుకాణాల్లో యూరియా కేటాయిస్తున్నారని, అంతదూరం వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మరో వైపు సర్వర్ సమస్య ఉత్పన్నమవుతుందని తెలిపారు. తక్షణమే సవరణ చర్యలు తీసుకోకపోతే నల్లగొండ జిల్లాలోని వేలాది మంది రైతులు పంట నష్టం, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తగిన చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారం చూపించని పక్షంలో ప్రజాహిత వాదన(పిల్)తో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని కలెక్టర్‌కు విన్నవించారు. వినతి పత్రం అందచేసిన వారిలో ఆంగోతు హతీరాంనాయక్, ఎం.రవీందర్ నాయక్, నాగయ్య, కె.చంద్రశేఖర్ ఉన్నారు.