జెనీవా: ఉక్రెయిన్‌లోని హాస్పిటళ్లు, అంబులెన్సులు, డాక్టర్లపై వేర్వేరుగా 70 దాడులు జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఆ దాడుల సంఖ్య రోజువారీగా పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఆరోగ్య కేంద్రాలపై దాడి ఆధునిక యుద్ధంలో వ్యూహాత్మక చర్యగా మారినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్‌లో హెల్త్‌కేర్ కేంద్రాలపై 72 దాడులు జరిగినట్లు డబ్ల్యూహెచ్‌వో ద్రువీకరించింది. ఈ దాడుల్లో సుమారు 71 మంది మృతిచెందారని, 37 మంది గాయపడినట్లు ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైమానిక దాడుల వల్ల హాస్పిటళ్లు ధ్వంసం అయ్యాయని, మెడికల్ ట్రాన్స్పోర్ట్స్, సప్లయ్ స్టోర్స్ కూడా దెబ్బతిన్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. కొన్ని సందర్భాల్లో వైద్య ఆరోగ్య సిబ్బందిని, రోగుల్ని కూడా కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. రోజువారిగా హాస్పిటళ్లను టార్గెట్ చేస్తున్న ఘటనలు పెరగడం ఆందోళనకరంగా ఉన్నట్లు ఉక్రెయిన్ ప్రతినిధి జార్నో హబిచ్ తెలిపారు. డాక్టర్లు, నర్సులకు ఆరోగ్య కేంద్రాలు సురక్షిత ప్రదేశాలు కావాలని, కానీ ఇలా జరగడం దారుణమన్నారు.