Ayatollah Ali Khamenei | ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ముగిసింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో 12 రోజులుగా సాగిన యుద్ధానికి తెరపడింది. దీంతో పశ్చిమాసియాలోఉద్రిక్తతలు చల్లారాయి. అయితే, ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మాత్రం ఇప్పటి వరకూ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఖమేనీ సురక్షితమైన బంకర్లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన ఫ్యామిలీతో కలిసి అత్యంత సురక్షితమైన బంకర్లో ఖమేనీ తలదాచుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే, కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి.. యుద్ధం ముగిసినప్పటికీ ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ‘ఖమేనీ ఎక్కడ..?’ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయన అదృశ్యంపై ఇరాన్ ప్రజలు, నేతల్లో ఆందోళనలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఖమేనీనే తమ టార్గెట్ అంటూ ఇజ్రాయెల్తోపాటూ అటు అమెరికా కూడా హెచ్చరించడంతో ఆయన బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నట్లు తెలుస్తోంది. తన ఉనికి ఎవరికీ తెలియకూడదని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కు కూడా దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖమేనీ కార్యాలయంలోని సీనియర్ అధికారి మెహదీ ఫజేలీని సుప్రీం లీడర్ ఆచూకీ గురించి ప్రశ్నించారు. ‘సుప్రీం లీడర్ ఖమేనీ గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి..? ఆయన ఆచూకీ గురించి చెప్పగలరా..? అని ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ‘మనమందరం ఆయన కోసం ప్రార్థిద్దాం. సుప్రీం లీడర్ రక్షణకు బాధ్యులుగా ఉన్న వారు తమ విధులు నిర్వహిస్తున్నారు’ అంటూ సమాధానమిచ్చారు. అయితే, ఖమేనీ అదృశ్యంపై ఓ కీలక అధికారి మాట్లాడుతూ.. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ సుప్రీం లీడర్‌ను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. అందుకే ఆయన సెక్యూరిటీ ప్రొటోకాల్స్ మరింత కఠినం చేసినట్లు వెల్లడించారు. అందుకే ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించట్లేదని వివరించారు.
Also Read..
Shubhanshu Shukla | జీరో గ్రావిటీకి అలవాటు పడుతున్నా.. అంతరిక్షం నుంచి శుభాన్షు శుక్లా సందేశం
Donald Trump | ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మళ్లీ రావొచ్చేమో : ట్రంప్
Donald Trump | భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది నేను.. మళ్లీ పాతపాటే పాడిన ట్రంప్