US-Iran : ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నెల 19న రెండు దేశాలు దీనిపై సంతకాలు చేసే అవకాశాలున్నాయి. అయితే, ఇరు దేశాల మధ్య కచ్చితంగా ఏ అంశాలు, షరతులపై ఒప్పందం కుదిరింది అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. పలు అంతర్జాతీయ మీడియా సంస్థల అంచనా ప్రకారం 14 అంశాల ఎజెండా ఆధారంగా అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందానికి వచ్చాయని సమాచారం. అవి. దాడులు సహా ఇతర యుద్ధ చర్యల్ని వెంటనే ఆపేయాలి.
వాణిజ్య రవాణాకు అనుగుణంగా హార్ముజ్ జలసంధిని వెంటనే పూర్తిస్థాయిలో తెరవాలి. ఇరాన్ పోర్టుల మీద అమెరికా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలి. చర్చల సందర్భంగా ఎలాంటి కొత్త ఆంక్షలు విధించరాదు. ఇరాన్ చమురుపై తాత్కాలిక మినహాయింపులు ఇవ్వాలి. స్తంభింపజేసిన, స్వాధీనం చేసుకున్న ఇరాన్ ఆస్తుల్ని విడుదల చేయాలి. 60 రోజులపాటు చర్చల కాలపరిమితి కొనసాగించాలి. అణ్వాయుధాల్ని ఇరాన్ కలిగి ఉండకూడదు. మిగిలిన యురేనియాన్ని శుద్ధి చేయకూడదు. ఇరాన్ అణుకేంద్రాల్ని నిషేధించాలి. ఇరాన్ వద్ద మిగిలిన యురేనియంపై చర్చలు జరగాలి. ప్రాంతీయంగా ఉద్రిక్తతలు తగ్గేందుకు చర్యలు తీసుకోవాలి. ఆర్థిక పరమైన, పునిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. తుది ఒప్పందంపై చర్చలకు అవకాశం ఇవ్వాలి. ఇందులో 300 బిలియన్ డాలర్ల పునరావాస ప్యాకేజీతోపాటు, దీర్ఘకాలిక పెట్టుబడులు, ఆర్థిక సహకారం వంటివి ఇరాన్ అడిగినట్లు కూడా తెలుస్తోంది.
తాజా ఒప్పందంలో కూడా ప్రధానంగా నిలుస్తున్న అంశం ఇరాన్ అణుకార్యక్రమం. తమ పౌర రక్షణ కోసమే అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్లు ఇరాన్ చెబుతుండగా, దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా అంగీకరించడం లేదు. ఈ విషయంలోనే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ అంశంలో రెండు దేశాలు 60 రోజుల ప్రత్యేక చర్చలు, అంగీకారానికి వచ్చాయి. అంటే ఈ 60 రోజుల్లో ఇరాన్‌లోని అణు కేంద్రాల్ని సందర్శిస్తారు. తనిఖీలు, యురేనియం శుద్ధీకరణ ప్రక్రియ, నిల్వలు వంటివి పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటారు.