Executive Order | అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చేపట్టారు. శ్వేత సౌధంలోకి అడుగుపెట్టగానే తనదైన స్టైల్లో పాలనను మొదలు పెట్టారు. తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేస్తానని ట్రంప్ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. గత బైడెన్ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్‌లో జారీ చేసిన విధ్వంసక, రాడికల్ ఆర్డర్లను కూడా రద్దు చేస్తానని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే అనేక కీలక అంశాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు తక్షణమే అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తొలిరోజే ఏకంగా వందకు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల (Executive Orders)పై సంతకాలు చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ, క్యాపిటల్ హిల్‌పై దాడి కేసులో 1600 మంది మద్దతుదారులకు క్షమాభిక్ష, జన్మతః పౌరసత్వంపై (birthright citizenship) వేటు వంటి వందకు పైగా అంశాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇప్పుడు అధ్యక్షుడి చేతిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఓ పవర్ఫుల్ ఆయుధంలా మారింది. ఇంతకీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ఏమిటి..? దానికున్న ప్రాధాన్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అధ్యక్షుడు (President) ఏకపక్షంగా తనకు సంక్రమించిన అధికారాలతో జారీ చేసే ఉత్తర్వులను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లుగా వ్యవహరిస్తారు. ఇవి చట్టాల వలే చాలా ప్రభావవంతంగా ఉంటాయి. గత అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసేందుకు కూడా కొత్త అధ్యక్షులు ఈ ఎగ్జిక్యూటివ్‌ను ఉపయోగించుకుంటుంటారు. ఈ ఆదేశాలకు చట్టబద్ధత ఉంటుంది. ఇందులో ప్రభుత్వ విధానాలకు సంబంధించి అధ్యక్షుడు తీసుకునే కీలక నిర్ణయాలు ఉంటాయి. ఇక వీటి అమలుకు ఎవరి ఆమోదం అవసరం ఉండదు. దీనికి అమెరికన్ పార్లమెంట్ ఆమోదం కూడా అవసరం లేదు.
చట్ట సభ ఆమోదం లేకుండా జారీ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. అధ్యక్షుడి ఆదేశాలను వ్యతిరేకించలేనప్పటికీ.. నిధుల విషయంలో వీటి అమలుకు అడ్డంకులు సృష్టించొచ్చు. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను తిరస్కరించేందుకు చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం కాంగ్రెస్‌కు ఉన్నప్పటికీ.. దానిపై వీటో అధికారం మాత్రం అధ్యక్షుడికే ఉంటుంది. అందుకే కాంగ్రెస్ ఆమోదించలేని అంశాలను తమ అజెండాలో అధ్యక్షుడు పెట్టుకుంటారు.
అమెరికా చరిత్రలో వేల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. జార్జ్ వాషింగ్టన్ ఎనిమిది ఆర్డర్లపై సంతకాలు చేస్తే.. ప్రాంక్లిన్ రూజ్ వెల్డ్ అత్యధిక ఆర్డర్లపై సంతకాలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్ష బాధ్యతల్లో 220 ఆర్డర్లపై సంతకాలు చేయగా, జో బైడెన్ తన హయాంలో 160 ఆర్డర్లపై (డిసెంబర్ 20 నాటికి) సంతకాలు చేశారు. అయితే అధ్యక్షుడు చట్టపరిధిని దాటి ఏదైనా నిర్ణయం తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కునే అవకాశం ఉంటుంది.
Also Read..
Donald Trump | అమెరికాలో పుడితే పౌరసత్వం ఇవ్వరు.. లక్షలాది మంది భారతీయులపై ప్రభావం
Donald Trump: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ.. రెండోసారి ట్రంప్ కీలక నిర్ణయం
Donald Trump: క్యాపిటల్ హిల్‌పై దాడి.. 1600 మందికి ట్రంప్ క్షమాభిక్ష