వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పలు కీలక పత్రాలపై ఆయన సంతకం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరించుకున్నట్లు ఆయన ఆదేశాలు జారీ చేశారు. వైట్‌హౌజ్ చేరుకున్న తర్వాత ఆయన పలు డాక్యుమెంట్లపై సంతకం చేశారు. దాంట్లో డబ్ల్యూహెచ్‌వో ఉపసంహరణ ఆదేశాలు కూడా ఉన్నాయి.
డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకోవాలని ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం ఇది రెండోసారి. కోవిడ్19 సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సరైన రీతిలో వ్యవహరించలేదని గతంలో కూడా ట్రంప్ ఆరోపించారు. జెనీవాకు చెందిన ఆ సంస్థ సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నట్లు గతంలోనూ వెల్లడించారు. కానీ బైడెన్ ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు.
#WATCH | Washington, DC: US President Donald Trump signs executive order to withdraw US from World Health Organization
“We paid 500 million dollars to World Health Organization when I was here and I terminated it. China with 1.4 billion people, they were paying 39 million. We… pic.twitter.com/xpbPGWNJ0K
— ANI (@ANI) January 21, 2025
వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అవసరం చాలా ఉందని, కానీ ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అన్నారు. ఒకవేళ వీలైతే మళ్లీ డబ్ల్యూహెచ్‌వోలో కలిసే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు. కోవిడ్19ను నియంత్రించడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని, చైనాలోని వుహాన్ నుంచి వ్యాపించిన ఆ వైరస్‌ను పసికట్టడంలో ఆ సంస్థ విఫలమైందని, అవసరమైన సంస్కరణలను చేపట్టలేకపోయిందని, సభ్య దేశాల నుంచి రాజకీయ ఐకమత్యాన్ని తీసుకురావడంలో అసమర్థంగా వ్యవహరించినట్లు ట్రంప్ ఆదేశాల్లో పేర్కొన్నారు.
డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా అందజేస్తున్న ఆర్థిక సాయంలో కూడా అవకతవకలు జరిగినట్లు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ట్రంప్ తన తొలి పాలన సమయంలోనే ఆరోపించారు. అయితే డబ్ల్యూహెచ్‌వోను అమెరికా వీడడం పట్ల పబ్లిక్ హెల్త్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఆరోగ్య వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని ఆరోపించారు. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వోకు అయిదోవంతు నిధులను అమెరికానే ఇస్తున్నది. ఒకవేళ ఆ సంస్థ నుంచి అమెరికా తప్పుకుంటే, అప్పుడు దానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.