Donald Trump | అమెరికా దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) పలు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు (executive order) జారీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ, క్యాపిటల్ హిల్‌పై దాడి కేసులో 1600 మంది మద్దతుదారులకు క్షమాభిక్ష వంటి ఆదేశాలు జారీ చేశారు. ఇక అమెరికా నేలపై జన్మించే వారికి హక్కుగా దక్కే పౌరసత్వానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.
ముందుగా చెప్పినట్టుగానే జన్మతః పౌరసత్వంపై (birthright citizenship) వేటు వేశారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.
బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అంటే..
అమెరికాలో జన్మించిన ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు ఏ దేశం వారనేది సంబంధం లేకుండా ఆటోమేటిక్‌గా దేశ పౌరసత్వం దక్కుతుంది. దీనినే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అంటారు. ఏ వీసాపై అమెరికాకు వచ్చినా, ఆఖరికి అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రులైనా సరే ఇక్కడ బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. 1868 నుంచి అమెరికాలో ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అమలులో ఉంది. అమెరికా రాజ్యాంగం.. 14వ రాజ్యాంగ సవరణ ద్వారా జన్మతః పౌరసత్వాన్ని కల్పిస్తోంది.
లక్షలాది మంది భారతీయులపై ప్రభావం
బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రద్దు నిర్ణయం అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నిర్ణయంతో గ్రీన్‌కార్డులు, హెచ్-1బీ వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయులు జన్మనిచ్చే పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులకు పౌరసత్వం లభించడంపైనే పిల్లల పౌరసత్వం కూడా ఆధారపడి ఉంటుంది. పిల్లల పౌరసత్వం కోసం గ్రీన్ కార్డు ఉన్న తల్లిదండ్రులకు కొంత న్యాయపరమైన వెసులుబాటు ఉండే అవకాశం ఉందని, హెచ్-1బీ వీసా కలిసిన తల్లిదండ్రులకు మాత్రం బిడ్డల పౌరసత్వంపై గందరగోళం నెలకొంటుందని ఇమిగ్రేషన్ నిపుణులు చెప్తున్నారు. అమెరికా గ్రీన్‌కార్డుల కోసం లక్షలమంది భారతీయులు ఏండ్లుగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో పౌరసత్వం రావడం పెద్ద కలగా మారింది. ఇప్పటివరకు పిల్లల పౌరసత్వంపై అయినా భరోసా ఉండేది. ఇప్పుడు అది కూడా పోయిందని అమెరికాలో ఉంటున్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Donald Trump | ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో.. డ్యాన్స్‌తో అలరించిన ట్రంప్ దంపతులు.. VIDEOS
Elon Musk: ట్రంప్ ర్యాలీలో ఎలన్ మస్క్ సంకేతం.. నాజీ సెల్యూట్ అంటూ విమర్శలు
Donald Trump: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ.. రెండోసారి ట్రంప్ కీలక నిర్ణయం
Donald Trump: క్యాపిటల్ హిల్‌పై దాడి.. 1600 మందికి ట్రంప్ క్షమాభిక్ష