China Spy Balloon | తమ గగనతలంలో ఎగురుతున్న చైనా బెలూన్ను అమెరికా కూల్చివేసింది. ఈ బెలూన్ గూఢచర్యం బెలూన్ అని ఎట్టకేలకు తేల్చినట్లు యూఎస్ మిలిటర్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 5 న తమ గగనతలంలో ఎగురుతున్న బెలూన్ను అమెరికా పరిశోధకులు గుర్తించారు. చైనా తమ దేశంపైకి పంపిన గూఢచర్యం బెలూన్‌గా దానిని గుర్తించి కూల్చివేశారు. బెలూన్ శిథిలాలను సముద్రం నుంచి వెలికితీసి పరిశీలించగా.. విస్తుపోయే వస్తువులు దాని నుంచి బయటపడ్డాయి. బెలూన్‌లో పెట్టిన వస్తువులను ఎప్పుడు, ఎలా వినియోగిస్తారనే దానిపై అధికారులు తెలుసుకుంటున్నారు. అమెరికా, కెనడాలో చైనా బెలూన్లను కూల్చివేసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నది. తమ మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉన్న ప్రదేశాల్లో అమర్చిన చైనీస్ సీసీటీవీలను ఆస్ట్రేలియా తొలగించింది.
అమెరికన్ మిలిటరీ నార్తర్న్ కమాండ్ ప్రకారం.. గత వారం దక్షిణ కరోలినా సముద్ర ప్రాంతంలో చైనా బెలూన్ను కూల్చివేశారు. నేవీ ప్రత్యేక బృందం చాలా శ్రమకోర్చి దాని శిధిలాలను వెలికితీసింది. ప్రయోగశాలకు తరలించి దానికి సంబంధించిన శిధిలాలను పరిశీలించారు. ఈ బెలూన్‌లో
హైడెఫినిషన్ సెన్సార్లు, కెమెరాలు అమర్చినట్లుగా అధికారులు గుర్తించారు. మరికొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిపుణులు సెన్సార్లను గూఢచార సేకరణ కోసం ఉపయోగించినట్లుగా తెలుస్తున్నది. అమెరికన్లు సురక్షితంగా ఉన్నారని తన దేశ పౌరులకు భరోసా
ఇవ్వాలనుకుంటున్నాను అని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఒక ప్రత్యేక ప్రకటనలో పేర్కొన్నారు. అటువంటి ముప్పును ఎదుర్కోవడంలో అమెరికా సైన్యం చాలా సమర్ధవంతమైన శక్తిని కలిగి ఉన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు.
తొలుత తమకు చెందింది కాదని బుకాయించిన చైనా.. ఆ తర్వాత పౌరులకు చెందిందని మాట మార్చింది. తమ దేశంపై కూడా అమెరికా ఇలాంటి 10 బెలూన్లను పంపిందని బుకాయించేందుకు ప్రయత్నించింది. రెండు బెలూన్లు కూల్చివేసిన తర్వాత జపాన్ కూడా ఇలాంటి బెలూన్లను తమ గగనతలంలో చూసినట్లు వెల్లడించింది. ఇది ముమ్మాటికీ గూఢచర్యానికి సంబంధించిందే అని జపాన్ చెప్పింది. బెలూన్లు కనిపించిన మోంటానా, సౌత్ కరోలినా అగ్రరాజ్యం సైన్యానికి చాలా ముఖ్యమైన ప్రదేశాలు. వాస్తవానికి ఈ ప్రాంతంలో వైమానిక దళానికి చెందిన ఖండాంతర క్షిపణులను సిద్ధంగా ఉంచారు. వాటిని టార్గెట్ మోడ్‌లో షూట్లో ఉంచుతారు. వీటిని కనిపెట్టేందుకే చైనా ఈ బెలూన్లను ప్రయోగించిందని వైట్‌హౌస్ ప్రతినిధులు స్పష్టం చేశారు.