Donald Trump : భారత్ (India), రష్యా (Russia) దేశాలకు తాము దూరమైనట్లు అనిపిస్తోందని, వక్రబుద్ది కలిగిన చైనా (China) చీకట్లలోకి ఆ రెండు దేశాలు వెళ్తున్నాయని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. ఆ మూడు దేశాలు వర్ధిల్లాలని తాను కోరుకుంటున్నానని ఎత్తిపొడుపు కామెంట్ చేశారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ (Truth social) లో ఒక పోస్టు పెట్టారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చైనాలోని తియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా భారత్-రష్యా, భారత్-చైనా, రష్యా-చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. ఆయా దేశాల ద్వైపాక్షిక అంశాలపై ఆ సమావేశాల్లో చర్చించారు. ఈ మూడు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు ట్రంప్‌కు కంటగింపుగా మారాయి.
అందుకు ఈ మూడు దేశాలను ఎత్తిపొడుస్తూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘భారత్, రష్యా దేశాలను తాము వక్రబుద్ధి కలిగిన చైనాకు కోల్పోతున్నట్లు అనిపిస్తోంది. చైనా చీకటి వలయంలోకి ఆ దేశాలు వెళ్తున్నాయి. ఆ మూడు దేశాలు కలిసిమెలిసి కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నా’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొ్న్నారు.
కాగా చైనాను నియంత్రించాలంటే భారత్ తమకు సరైన భాగస్వామి అని అమెరికా మొదటి నుంచి భావిస్తూ వస్తోంది. అందుకే రిపబ్లికన్లు, డెమోక్రాట్లు అన్న తేడా లేకుండా ఎవరు అమెరికా అధ్యక్షులైనా భారత్‌తో మైత్రి బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆఖరికి డొనాల్డ్ ట్రంప్ కూడా తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు భారత్‌తో మంచి సంబంధాలనే కొనసాగించారు. కానీ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.