ఉక్రెయిన్పై ఉన్నట్లుండి యుద్ధం ప్రకటించిన రష్యాను ప్రపంచ దేశాలన్నీ తప్పుబడుతున్నాయి. కానీ ఈ సంక్షోభం పైకి కనిపించేంత సులభంగా అర్ధమయ్యేది కాదని పలువురు నిపుణులు అంటున్నారు. తాజాగా సిరియా దేశ విదేశాంగ శాఖ డిప్యూటీ మినిస్టర్ బాషర్ జాఫరీ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ రాజకీయవేత్త కాదని జాఫరీ అన్నారు. అతన్ని పాశ్చాత్య దేశాలు తమ పథకంలో ఒక పావుగా వాడుకుంటున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘‘జెలెన్స్కీ రాజకీయ వ్యవస్థకు చెందిన వ్యక్తి కాదు. ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పొరోషెంకోపై జరిగిన కూప్ ఫలితంగా జెలెన్స్కీ రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ సమయంలో తమ పథకాల్లో జెలెన్స్కీని ఒక పావుగా పాశ్చాత్య దేశాలు వాడుకుంటున్నాయి. రష్యాతో తమ గొడవలోకి తీసుకొచ్చి అతని విలువను తగ్గిస్తున్నాయి’’ అని జాఫరీ వివరించారు.
‘‘ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి రష్యాను తొలగించాలని జెలెన్స్కీ అన్నారు. ఇదేమైనా యానిమేషన్ సినిమా అనుకున్నారా?’’ అని విమర్శించారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫాసిజాన్ని ఓడించిన దేశాలన్నీ కలిసి యూఎన్ భద్రతా మండలిని స్థాపించారు. వీటిలో రష్యా కూడా ఒకటి. నాజీల కంచుకోట బెర్లిన్ను బద్దలుకొట్టింది రష్యానే. అంతర్జాతీయంగా బ్యాలెన్స్ ఏర్పరచడంలో రష్యా పాత్రను ఎవరూ తక్కువ చేయలేరు. రష్యా, చైనా గనుక యూఎన్ భద్రతా మండలిలో లేకపోతే ఎన్ని యుద్ధాలు జరిగేవో ఒకసారి ఊహించండి’’ అని జాఫరీ చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని స్పష్టం చేశారు.