VanDyke : దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అంటూ అరెస్టు చేసిన అమెరికన్ మాథ్యూ వ్యాన్ డైక్ విషయంలో ఎన్ఐఏ కీలక నిర్ణయం తీసుకుంది. అతడిని తీవ్రవాదిగా పేర్కొంటూ దాఖలు చేసిన చార్జెస్‌ను ఎన్ఐఏ తొలగించింది. వ్యాన్ డైక్తోపాటు మరో ఆరుగురు ఉక్రెనియన్ పౌరులపై దాఖలు చేసిన టెర్రర్ చార్జెస్‌ను ఎన్ఐఏ రద్దు చేసింది. వీరిపై సెక్షన్ 21, సెక్షన్ 23కి చెందిన ఇమిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ యాక్ట్ కింద తాజాగా కేసు దాఖలు చేసింది.
గతంలో నమోదు చేసిన వాటిని తొలగించి, కొత్తసెక్షన్ల కింద కేసు దాఖలు చేసింది. దేశంలోకి విదేశీయుల ఎంట్రీ, ప్రవర్తించే తీరు, కార్యకలాపాలు సాగించడం వంటి అంశాలకు సంబంధించిన సెక్షన్లు ఇవి. దేశంలో ఉగ్రకుట్రలకు పాల్పడుతున్నారంటూ నిందితులను ఎన్ఐఏ గత మార్చిలో వివిధ ఎయిర్‌పోర్టుల్లో అరెస్టు చేసింది. ఉగ్రవాదులు ఎక్కువగా ఉన్న మయన్మార్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఉగ్ర శిక్షణ ఇస్తున్నారని అరెస్టు చేశారు. ఆ సమయంలో నిందితులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయగా.. ఇప్పుడు ఆ చట్టాన్ని తొలగించారు.
అయితే, ఈ చట్టం తొలగించి, వేరే సెక్షన్లు పెట్టడానికి గల కారణాల్ని మాత్రం విదేశీ వ్యవహారాల శాఖ, ఎన్ఐఏ అధికారులు వెల్లడించలేదు. చట్టపరమైన కారణాల వల్లే ఈ సెక్షన్లు తొలగించాల్సి వచ్చిందని మాత్రం పేర్కొన్నారు. వాన్ డైక్‌ను కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మార్చి 13న అరెస్టు చేయగా.. మిగతా నిందితుల్ని ఢిల్లీ, లక్నో ఎయిర్‌పోర్టుల్లో అరెస్టు చేశారు.