PM Shehbaz Sharif : బిచ్చగాళ్లు బిచ్చం కోసం ఇంటింటికీ తిరిగినట్లు తాము కూడా అప్పు కోసం ప్రపంచ దేశాలు తిరిగామని చెప్పుకొచ్చాడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. పాక్ ఆర్థిక పరిస్థితి ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉందో నేరుగా ఇలా ఆ దేశ ప్రధానే చెప్పడం విశేషం. తాను, దేశ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కలిసి అప్పు కోసం ప్రపంచ దేశాలు తిరిగినట్లు చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్లో జరిగిన ఒక సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయం వెల్లడించాడు.
దాయాది దేశం పాకిస్తాన్ దివాళా అంచున ఉంది. అందుకే తమకు ప్రపంచ దేశాలు అప్పులిచ్చి ఆదుకోవాలంటూ అనేక దేశాలు తిరిగినట్లు షెహబాజ్ షరీఫ్ వెల్లడించాడు. తనతోపాటు పాక్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ కలిసి వివిధ దేశాలు తిరిగినట్లు చెప్పుకొచ్చాడు. అనేక దేశాలకు వెళ్లి తమకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా సిగ్గు లేకుండా అడుక్కున్నామని, ఈ సమయంలో తామెంతో సిగ్గుపడ్డట్లు, అవమానాన్ని ఎదుర్కొన్నట్లు షరీఫ్ చెప్పాడు. ‘‘పాకిస్తాన్ విదేశీ రుణాల మీద ఆధారపడటం సిగ్గు చేటు. దీనివల్ల దేశం ఆర్థికంగా బలహీనంగా మారుతుంది. ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మన అధికారులు.. ముఖ్యంగా ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ఇబ్బంది ఎదుర్కొన్నాడు. నేను, అసిం కలిసి ప్రపంచ దేశాలు తిరిగి డబ్బు కోసం అడుక్కున్నాం. ఈ సమయంలో ఎంతో అవమానంగా ఫీలయ్యాం. తలవంచుకుని రుణాలు తీసుకున్నాం. ఈ సమయంలో వాళ్లు చెప్పిన అనేక పనులు చేసేందుకు ఒప్పుకోకతప్పలేదు.
విదేశీ రుణాలు ఎక్కువగా తీసుకోవడం వల్లే ఐఎంఎఫ్ రుణాలివ్వడం లేదు. మన మిత్రదేశాలైన చైనా, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ దేశాలు ఎంతో సాయం చేశాయి. పాక్ ఆర్థిక సంక్షోభంలో అండగా నిలబడ్డాయి’’ అని షెహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్తితి అత్యంత దయనీయ స్థితిలో ఉందని చెప్పేందుకు ఆ దేశ ప్రధాని మాటలే సాక్ష్యం. విదేశీ రుణాలు ఇస్తే తప్ప ఆ దేశం ప్రస్తుతం నిలదొక్కుకునే పరిస్థితి లేదు.