Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్ట్ ట్రంప్ (Donald Trump) తన రాజకీయ శత్రువులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని.. అటార్నీ జనరల్ పామ్ బోండీ (Pam Bondi) కి సూచించారు. ఈ మేరకు ఆయన ఆన్లైన్లో ఒక మెసేజ్ పెట్టారు. అయితే ఆ మెసేజ్‌ను ఆయన బోండీకి వ్యక్తిగతంగా పెట్టబోయి, పొరపాటున ఆన్లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పోస్టుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
అసలేం జరిగిందంటే.. తన రాజకీయ శత్రువులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అటార్నీ జనరల్ పామ్ బోండీకి ట్రంప్ సూచన చేయదలిచారు. అందులో భాగంగా ‘మనం ఇక ఆలస్యం చేయలేం. ఇది మన కీర్తి, విశ్వసనీయతను చంపేస్తుంది. వారు నన్ను రెండుసార్లు అభిశంసించారు. అభియోగాలు మోపారు. న్యాయం జరగాల్సిన సమయం వచ్చింది’ అని మెసేజ్ చేశారు.
మాజీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ, కాలిఫోర్నియా డెమోక్రటిక్ సెనెటర్ ఆడమ్ షిప్, న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఆ పోస్టు పెట్టారు. ఎందుకంటే కొంతకాలంగా వారితో ట్రంప్‌కు వైరం నడుస్తోంది. ఈ క్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. ట్రంప్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బోండీకి వ్యక్తిగతంగా మెసేజ్ పెట్టబోయి ట్రంప్ ఆన్లైన్లో పెట్టి ఉంటారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే దీని గురించి అమెరికా అధికారులు స్పందించలేదు. ఇదిలావుంటే బోండీని ప్రశంసిస్తూ ట్రంప్ మరో పోస్టు పెట్టారు. యూఎస్ అటార్నీ జనరల్‌గా ఆమె అద్భుతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. కానీ, తన విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు వర్జీనియాలోని లిండ్సే హాలిగాన్ వంటి ప్రాసిక్యూటర్ అవసరమని అభిప్రాయపడ్డారు.
ఆమెను యూఎస్ అటార్నీగా నామినేట్ చేస్తానని ట్రంప్ ప్రకటించారు. లిండ్సే అందరికీ సమాన న్యాయం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.