లండన్: మొక్కలకు జీవం ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. మన మాటలు, శబ్దాలకు మొక్కలు ప్రతిస్పందిస్తాయని కూడా పలువురు శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఇప్పుడు మొక్కలు మనతో తిరిగి మాట్లాడే కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సాయంతో యూకేకు చెందిన టామ్ మెస్సే, జె అహ్న్ అనే ఇద్దరు గార్డెనర్లు దీనిని తయారుచేశారు. దీనిని వచ్చే ఏడాది జరగనున్న ఓ కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు.
మొక్కలు పెంచే తోటలోని మట్టిలో సెన్సార్లు అమర్చడం ద్వారా ఈ సాంకేతికత పని చేస్తుందని మెస్సే తెలిపారు. ఈ సెన్సార్లు మట్టిలో తేమ, పోషక స్థాయిలు, ఆమ్లత, క్షారత్వాన్ని గుర్తించి అక్కడే అమర్చే కంప్యూటర్‌కు చేరవేస్తాయి. ఫోన్లోని ఓ ప్రత్యేక యాప్‌తో ఈ కంప్యూటర్ను అనుసంధానం చేస్తారు. ఏఐ సాయంతో ఈ యాప్ పని చేస్తుంది. ‘ఎలా ఉన్నావు?’, ‘నీరు పోయాలా?’ వంటి ప్రశ్నలను యాప్ ద్వారా అడిగితే, తోట సమాధానాలు ఇస్తుందని మెస్సే చెప్పారు.