వాషింగ్టన్ : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా దాడికి దిగవచ్చునని భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో అణు సామర్థ్యం కల యూఎస్ యుద్ధ విమాన వాహక నౌక అబ్రహం లింకన్ (సీవీఎన్-72) పశ్చిమాసియాలోని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రాంతంలోకి అడుగుపెట్టడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది. దీంతో ఇరాన్‌పై నేరుగా వైమానిక దాడికి అమెరికా రంగం సిద్ధం చేసినట్టయ్యింది. పైగా లింకన్ ఏమీ ఒంటరిగా రంగంలోకి దిగలేదు.
దాని పక్కనే మూడు గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్లు ఉన్నాయి. అవి యూఎస్ఎస్ ఫ్రాంక్ ఈ. పీటర్సన్ జూనియర్, యూఎస్ఎస్ స్ప్రూయెన్స్, యూఎస్ఎస్ మైఖేల్ మర్ఫీ నౌకలు. ఇరాన్‌పై దాడి చేస్తే పూర్తి స్థాయి యుద్ధం తప్పదని అమెరికాకు హెజ్బొల్లా, హౌతీలు హెచ్చరికలు జారీ చేశాయి. అమెరికా దాడి చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ మిలిటరీ సన్నద్ధమైంది. అమెరికాతో రహస్యంగా తాము శాంతి చర్చలు జరిపామని వస్తున్న వార్తలను ఇరాన్ విదేశాంగ శాఖ తోసిపుచ్చింది.