Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో ఇండియాలో మరోసారి పర్యటించనున్నారు. పుతిన్ గత ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆరు నెలల వ్యవధిలోనే మరోసారి పుతిన్ ఇండియా రానుండటం విశేషం. వచ్చే సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పుతిన్ పాల్గొంటారు. ఈ ఏడాది జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఇండియా ఛైర్మన్‌గా వ్యవహరిస్తోంది.
సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు పుతిన్ హాజరవుతారని రష్యా ప్రతినిధి యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ఈ నెల 14, 15 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు ఇరాన్ విదేశాంగ మంత్రితోపాటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెర్గీ లావ్రోవ్.. ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల కలయిక అని అర్థం. మొదట ఇందులో సౌతాఫ్రికా లేదు. అప్పట్లో బ్రిక్ అని పిలిచేవారు.
దక్షిణాఫ్రికా కూడాఈ కూటమిలో చేరడంతో ఆ దేశంలోని మొదటి అక్షరమైన ఎస్ కలిపి బ్రిక్స్ అని పిలవడం మొదలుపెట్టారు. అనంతరం బ్రిక్స్ ప్లస్ అనే కొత్త కూటమి కూడా ఏర్పడింది. ఇందులో బ్రిక్స్ దేశాలతోపాటు ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యూఏఈ, ఇండోనేసియా కూడా చేరాయి. ఈ దేశాలన్నింటినీ కలిపి బ్రిక్స్ ప్లస్‌గా పిలుస్తున్నారు. సౌదీ అరేబియా, అర్జెంటీనా కూడా ఈ కూటమిలో చేరబోతున్నాయి. గత ఏడాది 17వ బ్రిక్స్ సదస్సు బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగింది. ఈ ఏడాది సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ సదస్సుకు ఆయా దేశాల అధినేతలు హాజరవుతారు. గత ఏడాది డిసెంబర్లో ఇండియా–రష్యా మధ్య 23వ వార్షిక సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సదస్సుకు పుతిన్ హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలను కలిశారు. ఇరు దేశాల మధ్య పలు అంశాలపై చర్చలు జరిపి, ఒప్పందాలు కుదుర్చుకున్నారు.