మాస్కో: అంతా అనుకున్నట్లే జరిగింది. ఉక్రెయిన్పై రష్యా మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించింది. మిలిటరీ ఆరేషన్ చేపట్టినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యం తన ఆయుధాలను విడనాడాలని, వేర్పాటు వాదులు లొంగిపోవాలని సూచించారు. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. జోక్యం చేసుకునేవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు.
గురువారం ఉదయం పుతిన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్లో సైనిక చర్యను ప్రారంభిస్తున్నామని చెప్పారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులను రక్షించడానికే ఇది చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదైనా రక్తపాతం జరిగితే దానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యతవహించాల్సి ఉంటుందన్నారు.
పొరుగు దేశం నుంచి వస్తున్న బెదిరింపులకు ప్రతిగా మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఉక్రెయిన్ ఆక్రమించాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్యలో ఎవరూ తలదూర్చొద్దని, అలాకాకుండా ఎవరైనా జోక్యం చేసుకుంటే తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఉక్రెయిన్ను నాటోలో చేర్చవద్దనే తమ డిమాండ్ అని చెప్పారు. అయినప్పటికీ అమెరికా, దాని మిత్ర దేశాలు తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని విమర్శించారు. ఆయుధాలు విడిచిపెట్టిన ఉక్రెయిన్ సైనికుల జోలికి వెళ్లేది లేదని, వారిని సురక్షితంగా తరలిస్తామని పుతిన్ చెప్పారు.
గత కొన్నిరోజులుగా ఉక్రెయిన్-రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ సరిహద్దుల్లో పెద్దఎత్తున సైన్యాన్ని రష్యా మోహరించింది. కాగా, ఉక్రెయిన్లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలకు వ్లాదిమిర్ పుతిన్ స్వతంత్ర హోదా కల్పించారు. ఆ ప్రాంతాలకు రష్యా మిలిటరీ సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలో రష్యాపై అమెరికా, జర్మనీ, బ్రిటన్ సహా పలు దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించిన విషయం విధితమే.