వాషింగ్టన్, జనవరి 21: అమెరికాలో భారత సంతతి రాజకీయ నాయకుడు వివేక్ రామస్వామి ట్రంప్ సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసిన ‘డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న్మెంట్ ఎఫిషియెన్సీ’(డోజ్)ను వీడుతున్నట్టు సోమవారం ప్రకటించారు. ఓహియో గవర్నర్ పదవికి ఆయన పోటీ చేసే యోచనలో ఉన్నారు. ‘డోజ్ రూపకల్పనలో సాయం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ప్రభుత్వాన్ని క్రమబద్దీకరించడంలో మస్క్ అతడి బృందం సఫలీకృతం అవుతుందని భావిస్తున్నా’ అని వివేక్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘ఓహియోలో నా భవిష్యత్తు ప్రణాళికల గురించి త్వరలో మరిన్ని విషయాలు చెప్పాల్సి ఉంది. ముఖ్యంగా అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా తీర్చిదిద్దడంలో అధ్యక్షుడు ట్రంప్‌కు మేమంతా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన కొన్ని గంటలకే వివేక్ డోజ్‌లో తన పదవికి గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించారు.